నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా | chandra babu fires on ts cm | Sakshi
Sakshi News home page

నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా

Published Sun, Jan 31 2016 3:59 AM | Last Updated on Sat, Aug 18 2018 6:05 PM

నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా - Sakshi

నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా

నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేశా:  ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన భౌగోళికంగానే జరిగిందని, మనుషులు విడిపోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతిని కలిపే శక్తి తమ పార్టీకే ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి ఓటేయడం చారిత్రక అవసరమని అన్నారు. రెండ్రోజులపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల టీడీపీకి తెలంగాణ ప్రజలతో, హైదరాబాద్‌తో విడదీయరాని సంబంధం ఉందన్నారు. తెలంగాణ వెనుకబడిందనే విషయాన్ని గుర్తించి తమ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి పనులతో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కొత్త శకానికి నాంది పలికారని, దాన్ని తాను కొనసాగించానని వివరించారు.

అబిడ్స్ చుట్టుపక్కల ప్రాంతమే హైదరాబాద్ సిటీగా ఉన్న రోజుల్లో, పెట్టుబడుల కోసం విదే శీ ప్రతినిధులు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న నగరాన్ని నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చింది, గోదావరి జలాలకు శ్రీకారం చుట్టింది తానేనన్నారు. ‘‘ఎల్ అండ్ టీతో కలసి హైటెక్‌సిటీ నిర్మించాం. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకురావడంతోనే ప్రపంచంలో పేరొందిన ఐటీ, నాలెడ్జ్ ఆధారిత కంపెనీలన్నీ వచ్చాయి. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ కంపెనీల కోసం షాపింగ్ మాల్స్, హోటల్స్‌ను ప్రమోట్ చేశాం. స్పోర్ట్స్ కోసం స్టేడియాలను నిర్మించాం.

విదేశీయులు నేరుగా హైదరాబాద్‌కు వచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడి అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌కు అనుమతి పొందాను. తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశా. బిల్‌క్లింటన్, బిల్‌గేట్స్ మొదలు అంతర్జాతీయ ప్రముఖులందరినీ హైదరాబాద్‌కు తీసుకొచ్చా. నేను చేసిన కృషి, తీసుకు వచ్చిన సంస్కరణల వల్లే 1994-95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రంగా మారింది’’ అని వివరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

 గెలిచే కార్పొరేటర్లు పార్టీలోనే ఉంటారు
గ్రేటర్ ఎన్నికల్లో నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీలనే గెలిపించాలని చంద్రబాబు కోరారు. హైదరాబాద్ అభివృద్ధి చెందేందుకు కృషి చేశానని, అందుకే టీడీపీ-బీజేపీకి పాజిటివ్ ఓటు వేయాలన్నారు. తద్వారా ఇతరులు కూడా అభివృద్ధి కోసం పోటీపడతారని చెప్పారు. ‘‘టీడీపీని వదిలి పెట్టిన వారు పార్టీలో సామాన్య కార్యకర్తల స్థాయి నుంచి ఎలా డెవలప్ అయ్యారో చూశారు.

వాళ్లు పార్టీకి ద్రోహం చేసి స్వార్థం కోసం వేరే పార్టీల్లో చేరినంత మాత్రాన మిగతా వారు ఆ బాట పట్టరు. ఒక్కరు పోయారని అందరూ వెళ్లరు. పెద్దయ్యాక పిల్లలు తమని వదిలిపోతున్నారని పిల్లలను కనకుండా పోతే సమాజం ఏమవుతుంది? ఇదీ అంతే! టీడీపీలో గెలిచి మళ్లీ పార్టీ మారతారనే భయంతో ఓటు వేయడం మానొద్దు. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచే కార్పొరేటర్లు ఈ పార్టీలోనే ఉంటారు. పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలి’’ అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement