బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో | chandra babu naidu and KCR GHMC elections road show | Sakshi
Sakshi News home page

బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో

Published Fri, Jan 29 2016 2:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో - Sakshi

బాబూ.. నీ 13 జిల్లాలు ఊడ్చుకో పో

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఉధృతమైంది! గురువారం రెండు రాష్ట్రాల సీఎంలు రంగంలోకి దిగారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఉధృతమైంది! గురువారం రెండు రాష్ట్రాల సీఎంలు రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లగా.. ఏపీ సీఎం చంద్రబాబు శివారు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అయితే అందరూ ఊహించినట్టుగా సీఎంలు చురకత్తులు తిప్పుకోలేదు! కేసీఆర్.. బాబుపై సుతిమెత్తని విసుర్లతో సరిపెట్టారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి చర్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అది ఇప్పుడెందుకు? గ్రేటర్ ఎన్నికల తర్వాత చూద్దాం..’ అంటూ కేసీఆర్ నవ్వుతూ అన్నారు. ఇక చంద్రబాబు.. కేసీఆర్ పేరెత్తడానికి కూడా జంకినట్టు కనబడ్డారు. తన రోడ్‌షోలో ఎక్కడా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనలేదు. దీంతో బాబు రాకతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ కాస్తయినా బలం పుంజుకుంటుందని ఆశించిన తెలుగు తమ్ముళ్లు పూర్తిగా జావగారిపోయారు! 1
 
 ఆంధ్రప్రదేశ్‌లో ఉద్ధరించావు కానీ.. హైదరాబాద్ మిగిలిందా?
 అమరావతికే దిక్కులేదు.. హైదరాబాద్‌కేం చేస్తావు?
 తొమ్మిదేళ్లు పాలించావు.. విద్యుత్ కొరత ఎందుకు తీర్చలేదు?
 తాగునీటి సమస్య ఎందుకు పరిష్కరించలేదు?
 అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తామంటే జనం నమ్ముతారా?
 తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందన్నారు
 బాబు వంటి వారు ప్రాంతీయ కక్షలు రెచ్చగొట్టినా నగరం ప్రశాంతంగా ఉంది
 భాగ్యనగరంలో ఇళ్లకు మంచినీళ్లు ఎవరిస్తారో తెలియని దుస్థితి కాంగ్రెస్‌ది
 వెంకయ్యనాయుడూ.. 20 స్మార్ట్‌సిటీల్లో తెలంగాణకు ఒక్కటీ లేదా?
 తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష?

 
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబూ.. ఊడ్చుకోవాలంటే నీకు హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా చాలా ఉంది. ఎన్నో నగరాలు, పట్టణాలు ఉన్నాయి. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. హైదరాబాద్‌లో ఊడుస్తా అంటే ఎట్టా? ఇక్కడేం అవసరం? నువ్వు ఏపీ సీఎం.. అక్కడంతా ఉద్ధరించినవు కానీ హైదరాబాద్ మిగిలిందా ఊడ్చడానికి...?’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబును ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు పాలించారు. విద్యుత్ కొరత ఎందుకు తీరలేదు. తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు.
 
 
తొమ్మిదేళ్ల కాలం చాలలేదా..? ప్రచారానికి రావడమే అనవసరమైన విషయం. 17 ఏళ్ల టీడీపీ సుదీర్ఘ పాలనలో జరగనిది ఇప్పుడు చేస్తామంటే నమ్ముతారా? నువ్వు చేసుకోవడానికి నీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోవచ్చు. నీది ఇక్కడ వృథా ప్రయాస..’’ అని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గురువారమిక్కడ కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘నేనేదో ఆంధ్రా వాళ్లను గతంలో తిట్టానని కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను రాక్షసులు అన్నా. తెలంగాణను వ్యతిరేకించే ఈ ప్రాంతం వారిని కూడా సన్నాసులు, దద్దమ్మలు అన్నా. అది ఉద్యమ నేతగా నా కర్తవ్యం. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించిన.
 
హైదరాబాద్‌లో ఉన్న ఏ బిడ్డ అయినా మా బిడ్డే అని చెప్పా. హైదరాబాదీ అని గర్వించు.. కేసీఆర్ మీ వెంట ఉంటాడని అన్నా. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందన్నారు. 18 నెలలు పూర్తయ్యింది. జంట నగరాల్లో ఏమన్నా జరిగిందా? చంద్రబాబు సెక్షన్ 18 అమలు చేయాలన్నాడు. ఏపీ పోలీసు స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నాడు. చంద్రబాబు వంటి వాళ్లు ప్రాంతీయ కక్షలు రెచ్చగొట్టినా ఏం గొడవలు జరగలేదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. నాలుగు ఓట్లకు కక్కుర్తిపడి రెచ్చగొట్టకండి. కాంగ్రెస్, టీడీపీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి’’ అని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే ఉచితంగా తాగునీరు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోందని, తాగునీటిని ఎవరు సరఫరా చేస్తారో కూడా తెలియని దుస్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు. ‘‘తాగునీటి సరఫరా బాధ్యత హైదరాబాద్ జలమండలిది. దానికి జీహెచ్‌ఎంసీకి ఏం సంబంధం? ఇంత పేలవంగా, అనాలోచితంగా ఎలా మాట్లాడుతారు?’’ అని ప్రశ్నించారు.
 
అమరావతికే దిక్కులేదు..
‘‘హైదరాబాద్‌కు కేంద్రం నుంచి నిధులు తెస్తమని చంద్రబాబు ప్రచారం చేస్తుండ్రు. ఆయన అమరావతికే దిక్కులేదు. హైదరాబాద్‌కు ఏం తెస్తరు’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘అమరావతి శంకుస్థాపనకు పిలిస్తే నేనూ వెళ్లిన. కొత్తగా రాజధాని నిర్మించుకుంటున్నారు కాబట్టి మన వంతుగా కొంత సాయం ప్రకటిస్తే బావుంటుందని నా మిత్రులు చెబితే సరే అనుకున్న. డబ్బు ప్రకటిద్దామనుకున్న. కానీ అక్కడ టీపాయి మీద రెండు కుండలు తెచ్చి పెడితే పరేషాన్ అయిన. అవి ఏంటని వెంకయ్యనాయుడును అడిగా. మట్టి, నీళ్లు అని చెప్పిండు. ప్రకటన ఏదీ లేదని చెప్పిండ్రు. ప్రధాని ఉండగా నేను ప్రకటిస్తే.. ‘నాకంటే గొప్పోనివైనవా..’ అనుకోడా? ప్రధాని మట్టి నీళ్లు ఇచ్చి వెళ్తే.. నేను ఎలా ప్రకటిస్తా. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడుకు చెప్పా ఆయనా నవ్వారు’’ అని వివరించారు.
 
రాత్రికి రాత్రి ఏది సాధ్యం కాదు
టీఆర్‌ఎస్‌ను గెలిపించి, మేయర్ పీఠంపై కూర్చోబెట్టినా రాత్రికి రాత్రే సమస్యలు తీరుతాయని తాను అబద్ధపు మాటలు చెప్పనని సీఎం అన్నారు. లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య లేకుండా చేయడానికే కనీసం మూడు నాలుగేళ్ల సమయం పడుతుందన్నారు. రాష్ట్ర ఆదాయం (స్టేట్ ఓన్ రెవెన్యూ) 15 శాతం గ్రోత్ ఉందని, ఈసారి రూ.60వేల కోట్లు కేవలం ప్లాన్ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పొలిటికల్ టైస్టు అని వస్తున్న విమర్శలపైనా స్పందిస్తూ.. ఎవరు ఆ చర్యలకు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసునన్నారు. పార్టీలోకి చేరికలను తాను తెలంగాణ శక్తుల పునరేకీకరణగా భావిస్తున్నానన్నారు.
 
కేంద్రం వ్యవహార శైలి బాధిస్తోంది
‘‘దేశంలో 20 స్మార్ట్‌సిటీలను ప్రకటి స్తే ఏపీలో రెండు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కటీ లేదు. కాకినాడ, విశాఖపట్నం ఉంది. తెలంగాణలో మాత్రం కాకి ఎత్తుకపోయింది. దీనికి సమాధానం వెంకయ్యనాయుడే చెప్పాలి’’ అని సీఎం అన్నారు. ఒక్కోసారి కేంద్రం వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను బాధిస్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు ఎంపిక చేసిందని ప్రచారం చేసి పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాలుగా ఏపీని ప్రకటిస్తారు. చివరకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను కూడా ప్రకటించారు. దీన్ని ఏం అనుకోవాలి? క్రిసిల్ రేటింగ్ అని ఉంటుంది. తెలంగాణకు ఏ ప్లస్ ఇచ్చిండ్రు. టీఎస్ ఐపాస్ కింద ఇంక్యుబేటర్ సెంటర్ నిర్మిస్తే సత్యం నాదెళ్ల, రతన్ టాటా, సుందర్ పిచాయ్ వచ్చి వెళ్తారు. కేంద్రం నుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. తెలంగాణ పట్ల ఎందుకు పక్షపాతం వైఖరి. దేనికైనా ఒక అంతం ఉండాలి. ఎవరో మంత్రిని తీసుకు వస్తారు. కరువు నివేదిక ఇవ్వలేదని మాట్లాడిస్తరు. కేంద్రానికి,రాష్ట్రానికి ఉండేది రాజ్యాంగపరమైన సంబంధం. రాజకీయపరమైన చిల్లర, చిలిపి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలాని చూడడం సరికాదు. వెంకయ్యనాయుడు తెచ్చిన ప్యాకేజీ ఏందీ? లీకేజీ అయ్యింది ఎక్కడ ? ప్రాసల కోసం మాట్లాడాలంటే నేనూ మాట్లాడతా’’ అని కేసీఆర్ అన్నారు.
 
టీఆర్‌ఎస్.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ
‘‘మేయర్ సీటు మాదే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్‌ఎస్ అవతరిస్తది. అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి. రెండోది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మూడో దశలో ఎంఐఎం ఉండనే ఉంది. ఎంఐఎం మా మిత్రపక్షమే. మేం కలిస్తే మిగతా వారికి అవకాశం ఎక్కడిది?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘కేబినెట్‌లో మహిళలకు చోటు లేదు కాబట్టి మేయర్ పదవి ఇస్తారా అని అడుగుతున్నారు. మంత్రివర్గంలో మహిళలు ఉండాలన్న రూలేం లేదు. వారికి మేం ఎక్కడ అవకాశం ఇవ్వాలో అక్కడ ఇచ్చాం. డిప్యూటీ స్పీకర్, విప్‌గా మహిళలే ఉన్నారు. ఫలితాలు తేలాక మేయర్ ఎవరో డిసైడ్ అవుతుంది’’ అని అన్నారు.
 
రాజకీయాంశాలే కాకుండా.. మీడియా నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు ఇచ్చారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి చర్యలు ఉంటాయా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానిపై గ్రేటర్ ఎన్నికల తర్వాత చూద్దామని నవ్వుతూ అన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్‌ను నాలుగైదు జిల్లాలుగా విభజించబోతున్నామని చెప్పారు. తన రాజకీయ వారసత్వాన్ని ప్రజలే నిర్ణయిస్తారని మరో  పశ్నకు సమాధానంగా చెప్పారు. వీలైతే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement