ఇక్కడే ఉంటా.. అభివృద్ధి చేస్తా.. | chandra babu naidu in GHMC election compain | Sakshi
Sakshi News home page

ఇక్కడే ఉంటా.. అభివృద్ధి చేస్తా..

Published Fri, Jan 29 2016 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇక్కడే ఉంటా.. అభివృద్ధి చేస్తా.. - Sakshi

ఇక్కడే ఉంటా.. అభివృద్ధి చేస్తా..

‘గ్రేటర్’ ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు
టీడీపీ ధైర్యానికి మారుపేరు
ఎన్టీఆర్ అయినా నేనైనా ఇందిర, రాజీవ్, సోనియాకే భయపడలేదు
ఇక్కడి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు
భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 ఏళ్లు పట్టింది
కానీ నేను తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించా
నా మనసంతా హైదరాబాద్‌పైనే..
రోడ్‌షోలో కేసీఆర్‌ను ఎక్కడా నేరుగా విమర్శించని టీడీపీ అధినేత

 
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఏం పని అని కొందరంటున్నారు.. నేను ఎక్కడికీ పోలేదు.. ఏపీకి సీఎంగా ఉన్నా హైదరాబాద్‌ను వదిలిపోలేదు. ముఖ్యమంత్రిగా ఏపీలో ఉంటా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణలో ఉంటా..’’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ధైర్యానికి మారుపేరని, ఎన్టీఆర్ అయినా తానైనా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలకే భయపడలేదని చెప్పారు.
 
తెలంగాణ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లే లక్ష్యంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రోడ్‌షోలకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండ్రోజుల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు గురువారం పటాన్‌చెరు నుంచి రోడ్‌షో ప్రారంభించారు. పటాన్‌చెరు చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన అక్కడ్నుంచి.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు సీమాంధ్రులు ఎక్కువగా నివసించే ప్రాంతాల మీదుగానే చంద్రబాబు రోడ్‌షో రూట్‌మ్యాప్ రూపొందించారు.
 
పలుచోట్ల ప్రసంగించిన ఆయన.. సీమాంధ్రుల సమస్యలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీపై చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. సీమాంధ్ర కు చెందిన 26 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ అందరిదని, దాని అభివృద్ధిలో టీడీపీ పాత్ర కీలకమైనదని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నివసించే వారందరికీ భద్రత ఉండాలన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని పేర్కొన్నారు.
 
సీఎంలుగా కలుసుంటాం..
‘‘జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలపైనా నాకు హక్కు ఉంది. తెలంగాణ గురించి మాట్లాడేందుకు నేనెవ్వరికీ భయపడను. తెలంగాణను అభివృద్ధి చేసిందే తెలుగుదేశం. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను తొలగించి నిజమైన స్వాతంత్య్రం తెచ్చింది ఎన్టీఆర్ అయితే.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో చేర్చింది నేను’’ అని బాబు తన రోడ్‌షోలో వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంగా తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపు గురించి కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. ‘‘అమరావతి శంకుస్థాపన కోసం నేను స్వయంగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలిస్తే.. చండీయాగానికి నన్ను పిలిచారు. ప్రభుత్వాలు వేరు రాజకీయాలు వేరు. ప్రభుత్వాల పరంగా కేసీఆర్‌తో సహకరించుకుంటాం. రాజకీయంగా మాత్రం విరోధులమే’’ అని చెప్పారు.
 
కేసీఆర్‌ను నేరుగా విమర్శించకుండా..
గతంలో చంద్రబాబు తన ప్రసంగాల్లో కేసీఆర్‌పైనే నేరుగా విమర్శలు చేసేవారు. ఎన్నికల ప్రచార సభల్లో అయితే తానే కేసీఆర్‌కు గురువును అనే తరహాలో ప్రసంగించేవారు. కానీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కే సీఆర్‌ను గానీ, టీఆర్‌ఎస్ పార్టీని గానీ విమర్శించే సాహసం చేయలేదు. కేసీఆర్‌ను విమర్శించాల్సి వచ్చిన ప్రతీసారి తెలంగాణ ప్రభుత్వం పేరునే ఉపయోగించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మీడియా సమావేశంలో కేసీఆర్ అన్న మాటలపైనా ఆచితూచి వ్యాఖ్యానించారు. ‘నేను అక్కడా ఉంటా... ఇక్కడా ఉంటా..’ అనే ధోరణితోనే మాట్లాడారు తప్ప కేసీఆర్‌ను పేరు పెట్టి ఎక్కడా విమర్శించకపోవడం గమనార్హం. బాబు వెంట టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాగంటి గోపీనాథ్‌లతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు.
 
సిటీ నుంచి హరీశ్ తడీపార్: రేవంత్
తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ హైదరాబాద్ ప్రజలను కోరుతున్నారని, అయితే చిన్న పిల్లలు అడిగినట్లు ఇచ్చేందుకు హైదరాబాద్ చాక్లెట్, ఐస్‌క్రీం కాదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. దొంగలను పోలీసులు ఊరి బయట వదిలినట్లు కేసీఆర్, కేటీఆర్ కలసి హరీశ్‌ను గ్రేటర్ హైదరాబాద్ నుంచి తడీపార్ (నగర బహిష్కరణ) చేశారని వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్‌లో టీడీపీ ఓడిపోతే తాను రాజీనామా చేయాలన్న హరీశ్ సవాలుపైనా స్పందించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారి స్థానంలో టీఆర్‌ఎస్ గెలిచి చూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు.
 
 హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది నేనే..
 హైదరాబాద్‌కు ఐటీని తీసుకొచ్చింది తానేనని, హైటెక్‌సిటీ నిర్మాణంతో హైదరాబాద్ కొత్తరూపు సంతరించుకుందని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు నిజాం నవాబులకు 400 ఏళ్లు, సికింద్రాబాద్ అభివృద్ధికి ఆంగ్లేయులకు 100 ఏళ్లు పడితే తాను తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించానన్నారు. ‘‘ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణాలకు పునాది పడింది తెలుగుదేశం హయాంలోనే. రైతు బిడ్డలు పొలాలు వదిలి సాఫ్ట్‌వేర్ బాట పట్టారంటే అది మా ఘనతే. మెట్రోరైలు ప్రాజెక్టు అనుమతులు మా హయాంలోనే వచ్చాయి. ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుందో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉంటే మూడేళ్లలోనే మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవాళ్లం. గ్రేటర్‌లో టీడీపీ, బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యం’’ అని బాబు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement