
'చంద్రబాబు కొన్ని లక్షల తప్పులు చేశారు'
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఏపీ ప్రజలకు 2015లో ఒక్క తీపి జ్ఞాపకం కూడా మిగలలేదని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని లక్షల తప్పిదాలు చేశారని ధ్వజమెత్తారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, ఇసుక మాఫియా... ఇలా వందలాది మాఫియాలకు నిలయంగా విజయవాడను మార్చారని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మహిళలు, పేదల వ్యతిరేక పాలనగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపపడ్డారు. కొత్త సంవత్సరంలోనైనా మంచి పాలన అందించాలని చంద్రబాబుకు రాంబాబు హితవు పలికారు.