దర్యాప్తు ఆపండి!
నిప్పునే చెబుతున్నా..
- ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మాట నిజం
- ‘మావాళ్లు బ్రీఫ్‌డ్‌మీ.. అన్నీ నేను చూసుకుంటా’
- అని నామినేటెడ్ ఎమ్మెల్యేకి హామీ ఇవ్వటం ఆడియో టేపు సాక్షిగా నిజం
- రూ. 50 లక్షలిస్తూ ‘బాస్ ఇవ్వమంటేనే మీకిస్తున్నా.. బాస్‌తో మాట్లాడిస్తా’ అని రేవంత్ చెప్పడం..వీడియో టేపు సాక్షిగా నిజం
- తెలంగాణ ఎమ్మెల్యేతో మాట్లాడిన టేపు వాస్తవమైనదే అని తేలడం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సాక్షిగా నిజం
అయిననూ...
- చార్జిషీట్‌లో ఉన్న ఈ అంశాల ప్రస్తావన లేకుండా సాంకేతిక అంశాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
హైకోర్టులో చంద్రబాబు ‘అత్యవసర’ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎప్పుడూ పైకోర్టులకు వెళ్లి ‘స్టే ఉత్తర్వుల’ కోసం ప్రయత్నించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ అదే పని చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తన పాత్రపై దర్యాప్తు చేసేలా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం గత నెల 29న ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేయాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు తేలేంత వరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు సర్టిఫైడ్ కాపీ (అధికార ధ్రువీకృత ప్రతి) దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని కూడా కోరారు. గురువారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే క్రిమినల్ కేసుల కొట్టివేత పిటిషన్లను విచారించే న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ ముందు చంద్రబాబు పిటిషన్ గురించి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణ ప్రకాశ్ ప్రస్తావించారు. లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. దానికి న్యాయమూర్తి అంగీకరించారు. దాంతో మధ్యాహ్నం 2.45 గంటలకు చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణ ప్రకాశ్ వాదిస్తూ.. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు అధికార ధ్రువీకృత ప్రతి దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
ఈ సమయంలో ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కాపీని తమకు అందచేయలేదని, ఆ కాగితాలను తమకు అందచేసేలా చూడాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి పిటిషన్ కాపీతో పాటు కేసు డాక్యుమెంట్లను కూడా ఫిర్యాదుదారుకు అందచేయాలని కృష్ణప్రకాశ్‌ను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జైశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు తన పిటిషన్‌లో ‘ఓటుకు కోట్లు’ కేసు జరిగిన తీరు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆ చట్ట పరిధిలోకి రావని హైకోర్టే చెప్పింది...
ఏసీబీ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. అందులో 5వ నిందితునిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని పేర్కొందని పిటిషన్‌లో చంద్రబాబు వివరించారు. తదుపరి దర్యాప్తులో మొదటి నలుగురు నిందితులకు సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే వాటిని అనుబంధ చార్జిషీట్ రూపంలో కోర్టు ముందుంచుతామని కూడా ఏసీబీ చెప్పిందన్నారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు (మత్తయ్య) ఇదే హైకోర్టులో కేసును కొట్టేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ ఏడాది జూన్ 3న తీర్పునిస్తూ మత్తయ్యపై కేసును కొట్టేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం అటు ఫిర్యాదు, ఇటు చార్జిషీట్‌లోని ఆరోపణలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని తేల్చి చెప్పిందని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక ఏసీబీ అధికారులు నమోదు చేసిన నేరపూరిత కుట్ర (ఐపీసీ సెక్షన్ 120బి), నేరాన్ని ప్రోత్సహించడం (ఐపీసీ సెక్షన్ 107) వంటి సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసిందన్నారు.
మేజిస్ట్రేట్ అలా అంటే సరిపోదు...
‘స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇవ్వచూపిన వ్యవహారంలో నా కుట్ర ఉందని రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇందుకు ఆయన బహిరంగ సభలో నా ప్రసంగం, ఓ ఫోన్ సంభాషణలపై ఆధారపడ్డారు. దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు. ఇది నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు. ప్రత్యేక కోర్టు కూడా చార్జిషీట్ దాఖలైన కేసులో మళ్లీ దర్యాప్తు జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలైన కేసులో మళ్లీ దర్యాప్తునకు ఆదేశించడం చట్ట ప్రకారం చెల్లదు. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద ఆ దశలో అధికారాన్ని ఉపయోగించడం కుదరదు. కింది కోర్టు ఆదేశాలు విపరీత పరిస్థితికి దారితీస్తున్నాయి. చార్జిషీట్ దాఖలు తరువాత దర్యాప్తు చేయడమంటే ఒకే కేసులో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే అవుతుంది. ఈ ఫిర్యాదు దాఖలు చేయడానికి ఏడాది ముందే ఈ కేసులో చార్జిషీట్ దాఖలైంది. అసలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఫిర్యాదుదారుకు లేదు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు అతనేమీ బాధితుడు కాదు. సెక్షన్ 156(3) కింద అధికారాన్ని ఉపయోగించేటప్పుడు కోర్టులు జాగరూకతతో ఉండాలి. ఫిర్యాదును పరిశీలించాను.. డాక్యుమెంట్లను చూశాను.. ఫిర్యాదుదారు వాదనలు విన్నాను.. అని మేజిస్ట్రేట్ అంటే సరిపోదు. సెక్షన్ 156(3) కింద ఆదేశాలు ఇచ్చేందుకు దారితీసిన బలమైన కారణాలు ఏమిటో స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఈ పని చేయలేదు. దర్యాప్తునకు ఆదేశించేందుకు కారణాలను ప్రస్తావించలేదు.’ అని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.
కక్ష సాధించేందుకే ఈ ఫిర్యాదు...
‘ఫిర్యాదుదారు ఆరోపించినట్లు నేను ఎటువంటి నేరం చేయలేదు. ఫిర్యాదులో నాపై చేసిన ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతున్నా. విచారణకు స్వీకరించదగ్గ నేరం చేసినట్లు ఫిర్యాదుదారు నిరూపించలేదు. ఏసీబీ కోర్టు అవసరం లేని తొందరపాటును ప్రదర్శించి దర్యాప్తునకు ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయాలని ఆదేశించే పరిస్థితులు గానీ, కారణాలు గానీ లేవు. అయినా కూడా కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఫిర్యాదుదారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. నన్ను ఇబ్బందిపెట్టేందుకు, వేధింపులకు గురి చేసేందుకే దురుద్దేశాలతో, రాజకీయకక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. కక్ష సాధింపులకు అతను ప్రైవేటు ఫిర్యాదును ఓ ఆయుధంగా మలచుకున్నారు. తెలంగాణలో జరిగిన ఈ కేసుకూ, అతనికి ఎటువంటి సంబంధం లేదు. అటు ఈ ఫిర్యాదు, ఇటు కోర్టు ఆదేశాలు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే.’ అని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
నేడు విచారణ జరపనున్న జస్టిస్ ఇలంగో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (నేడు) న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించనున్నారు. రోస్టర్ ప్రకారం ఈ కేసును జస్టిస్ జైశ్వాల్ విచారించాల్సి ఉంది.. అయితే ఆయన ముందుగా నిర్ణయమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ వెళుతున్నారు. దీంతో ఈ కేసు జస్టిస్ రాజా ఇలంగో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ కోర్టులో నందమూరి లక్ష్మీపార్వతి ఫిర్యాదు దాఖలు చేసినపుడు కోర్టు విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టు అధికరణ 226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇపుడు రిట్ దాఖలు చేసేందుకు ‘పరిస్థితులు’ సానుకూలంగా లేకపోవడంతోనే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారని వినిపిస్తోంది.