ప్రపంచ పటంలో పెట్టింది నేనే | Chandrababu, Nadda launch TDP-BJP campaign for Hyderabad polls | Sakshi
Sakshi News home page

ప్రపంచ పటంలో పెట్టింది నేనే

Published Wed, Jan 13 2016 2:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రపంచ పటంలో పెట్టింది నేనే - Sakshi

ప్రపంచ పటంలో పెట్టింది నేనే

హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు కష్టపడుతున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతల్లో ఉన్నందునే హైదరాబాద్‌లో తిరగడం లేదని చెప్పారు. అదే సమయంలో తానెక్కడికీ పోలేదని, మీతోనే ఉంటానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ‘టీడీపీ, బీజేపీ ఎన్నికల శంఖారావం’ సభను మంగళవారం నిజాం కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు.. టీఆర్‌ఎస్ పేరెత్తకుండా, సీఎం కేసీఆర్‌ను పల్లెత్తు మాటనకుండా తన శైలికి భిన్నంగా సాదాసీదాగా ప్రసంగించడం గమనార్హం. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగు వారంతా ఒక్కటేనని, తెలుగు జాతికి అన్యాయం జరగకుండా విభజన జరగాలని చె ప్పానని గుర్తుచేశారు. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు.
 
అందుకే ముందుకు పోయాను..
‘రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఇబ్బందులను కూర్చొని పరిష్కరించుకోవాలని నేనే ప్రతిపాదించా. కలుసుంటే నష్టాలను భర్తీ చేసుకోవచ్చనే ముందుకు పోయాను..’ అని కేసీఆర్‌తో సత్సంబంధాలపై అన్యాపదేశంగా చంద్రబా బు చెప్పారు. ‘ప్రభుత్వం- ప్రభుత్వం రెండూ సహకరించుకుంటాయి. కేంద్రంలో ఎన్‌డీఏ, ఏపీలో బీజేపీ-టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పనిచేస్తే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో అభివృద్ధి జరగాలని, ఏపీతో సమానంగా అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.

హైదరాబాద్ తరహాలో ఏపీ తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నా. లుక్ ఈస్ట్ సాధ్యం చేసేందుకు తూర్పు తీరాన్ని అభివృద్ధి చేస్తున్నా’’ అని వివరించారు. ‘‘సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి. ఆ పరిస్థితిని మార్చాలని భావించా. దేశ విదేశాల్లో ప్రముఖులను కలిశా. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ను నిర్మించా. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని వాజ్‌పేయితో కలిసి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశా. ఐటీ కారిడార్‌ను డెవలప్ చేశా. రోడ్లు వెడల్పు చేశా.

ఔటర్ రింగ్‌రోడ్డు తీసుకొచ్చా. 4 లక్షల ఐటీ ఉద్యోగాలు, పరోక్షంగా మరో 12 లక్షల ఉద్యోగాలు తెచ్చా. తెలంగాణలో వెనుబాటుతనాన్ని పారదోలేందుకు నిరంతరం కృషి చేశా’’ అని బాబు చెప్పారు. 2019లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, అం దుకు గ్రేటర్ ఎన్నికలు నాంది కావాలన్నారు.
 
మాటలు తప్ప.. అభివృద్ధి లేదు: లోకేశ్
రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణలో మాటలు తప్ప అభివృద్ధి లేదని, అదే లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో గోదావరి, కృష్ణా అనుసంధానం చేశామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు తీసుకొని అమరావతి నిర్మిస్తున్నారని వివరించారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎస్సీల సీట్లను నరికేశారని విమర్శించారు. ‘‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు నిజాం రాజులకు 200 ఏళ్లు పట్టాయి.

సికింద్రాబాద్‌ను బ్రిటిషర్లు 50 ఏళ్లలో అభివృద్ధి చేశారు. చంద్రబాబు మా త్రం పదేళ్లలోనే సైబరాబాద్‌ను నిర్మించారు. నాలాగా తెలంగాణలో పుట్టి పెరిగిన హైదరాబాద్ వాసులకు కేసీఆర్‌పై నమ్మకం పోయింది’’ అని అన్నారు. 2019లో టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, మన నాయకుడే సీఎం అవుతారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ... ఎన్డీఏ హయాంలో హైదరాబాద్ 15 ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందిందన్నారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీలను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి... కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య, ఎంపీ మల్లారెడ్డి, వివేకానంద, మాగంటి గోపీనాథ్, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement