దబాయింపు, తిట్లు, శాపనార్థాలు సమాధానం కావు
'రాయలసీమా, రాయలసీమా! నువ్వెక్కడ?' అన్న వ్యాసానికి స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. కొందరు బాధపడ్డారు. కొందరు నిట్టూర్చారు. కొందరు సలహాలు ఇచ్చారు. కొందరు సహేతుకమైన ప్రశ్నలు అడిగారు. కొందరు దూషించారు. కొందరు శపించారు. కొందరు రాయలసీమ ప్రస్తావనతో అమృతతుల్యమైన అమరావతి భాండం విషతుల్యమవుతుందని.. రాయడానికి వీలులేని భాషలో మొరిగారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా జన్మ సంస్కారం వల్ల ఆ భాష, ఆ మాండలికం అలాగే మిగిలి ఉన్నందున వారి భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించి అలా వదిలేసి.. మిగతా అన్ని ప్రశ్నలు, అనుమానాలు, భయాలకు వివరణ ఇవ్వడం బాధ్యత.
గోదావరి జలాలు కృష్ణాతీరంలో రెండో పంటకే కాకుండా, మూడో పంటకు కూడా ఉపయోగపడితే మంచిదే. అందుకు ఆనందించాల్సిందేకానీ, బాధపడాల్సిన పని లేదు. కృష్ణా జిల్లా మీదుగా శ్రీశైలం దాటకపోతే గోదావరి జలాలు కృష్ణతో అనుసంధానమై రాయలసీమను ఎలా సస్యశ్యామలం చేస్తాయి? కృష్ణా జిల్లా లబ్ధిపొందడం దారి మధ్యలో ఉన్న ప్రయోజనమేకానీ, పరమ ప్రయోజనం రాయలసీమకే అని అపర సర్ ఆర్థర్ కాటన్లు విశ్లేషణల క్రస్ట్ గేట్లు ఎత్తేశారు. మోటర్లతో తోడివేసినా, బక్కెట్లు, చెంబులతో కలిపినా సాంకేతికంగా నదుల అనుసంధానమే. తత్వాన్ని అర్థం చేసుకోండి, తక్షణ ప్రయోజనాన్ని ప్రశ్నించకండి అని కొత్త జలతత్వాన్ని ముందుకు తెచ్చారు.
ఉద్దేశాలు, చివరి అంచె లబ్ధిదారులు, గ్రావిటీ, లిఫ్ట్ మార్గాల్లో అసలు నుండి చివరకు వచ్చేసరికి మిగిలేదెంత? ఎంత సమయం పడుతుంది? పట్టిసీమ పేరు మారి పోలవరం పడి కాలువ ఎందుకయ్యింది ? సముద్రంలో వృధాగా వెళ్లే నీరు సన్రైసింగ్ స్టేట్ అంతా ఎలా మళ్లిస్తారు ? లాంటి ప్రశ్నలు రాయలసీమవారే కాదు ఎవరైనా అడగవచ్చు.. అడగాలి కూడా. కృష్ణా జిల్లా సగభాగం పొడిగానే ఉంటుంది. ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్రలో మంచినీటి చుక్కలకు గుక్కపట్టి బాధపడే ఊళ్లు లేవా? నయా రాజధాని అమరావతి గ్రాఫిక్స్ లో అన్నీ వాటర్ ఫ్రంట్లే. కొత్త రాజధాని దాహంతో పిడచకట్టుకుపోకుండా తగిన బందోబస్తు అధికారికంగా, అనధికారికంగా చేస్తున్నారు.. సంతోషం.
పైసా పైసాకు ప్రధేయపడుతూ భూమి పూజ ఒకసారి, శంకుస్థాపన ఒకసారి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా ఖర్చుకు వెనుకాడకుండా చేశారు. శంకుస్థాపన సభాస్థలిపై అప్పటిదాకా ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఆర్థికసాయం చేయండంటూ ప్రధాని వైపు తిరిగి మాట్లాడారు మరో భాషలో. ప్రధాని ఏమి అర్థం చేసుకున్నారో తెలీదుకానీ సభలోనే మట్టి చల్లారు. ప్రధానమంత్రి బిహార్ ప్యాకేజీ, జమ్ముకాశ్మీర్ కు సాయం, నిన్నటికి నిన్న తమిళనాడుకు చేయూత చూశాక ఏపీకి ఏమొస్తుందో అందరికీ అర్థమవుతూనే ఉంది.
ఇక అసలు విషయానికొద్దాం...
1998,99 ప్రాంతాల్లో బాబు విడిపోని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'తెలంగాణ' అన్న పదం నిషిద్ధం. నోటితో అనకూడదు, ఎవరైనా లోగొంతుకతో అన్నా పరులు వినకూడదు. డెప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కెసీఆర్ తెలంగాణ రైతుల కన్నీటి కష్టాలపై బాబుకు బహిరంగ లేఖ రాస్తే ఒక టి.వి.ఛానెల్ లో 'తెలుగుదేశంలో ముసలం' అని హెడ్ లైన్ వార్త ప్రసారమయ్యింది. తక్షణం సి.ఎం.సి.పి.ఆర్.విజయ్ కుమార్ రంగప్రవేశం చేసి ఏలినవారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారంటూ వార్తకు హెడ్ లైన్ మార్పించుకున్నారుయాజమాన్యం సహకారంతో. ఆ వార్తలో బాబు సేవకుల అభ్యంతరాలు రెండు. 1.అది ముసలం కాదు. 2. తెలంగాణ నిషిద్ధం. అది ముసలం అవునో కాదో తరువాత కాలమే చెప్పింది. రెండోది.. తెలంగాణకు అనుకూలంగా మా లేఖ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని అడగనివారికి కూడా చెప్పుకున్నారు.
ఇప్పుడు రాయలసీమను కూడా బాబు అలాగే హ్యాండిల్ చేస్తున్నారు. రాయలసీమ గురించి మాట్లాడితే వేర్పాటువాదుల ముద్ర వేస్తున్నారు. నీళ్లు, నిష్పత్తి, హక్కులు, అవసరాలు, మానవీయత, ఉపాధి అవకాశాలు లేదా ఒప్పందాలు అమలుకాక రాయలసీమకు జరిగిన అన్యాయంలాంటివి మాట్లాడగానే వేర్పాటువాదులైపోతారా ? ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
నిన్నమొన్నటిదాక తెలంగాణను, తెలంగాణ మాండలికాన్ని కూడా ఇలాగే ఎగతాళి చేసినవారు ఇప్పుడేమయ్యారు ? ఏ ప్రాంతానికైనా ఒక చరిత్ర, వారసత్వం, ఒక మాండలికం, కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. వాటిని మీరు గౌరవించకపోతే నష్టం లేదు. అవమానించకండి. బాధపడితే నాలుగు ఎంగిలి మెతుకుల కోసం మొసలి కన్నీరు అంటారా ? అన్నం తినేవారెవరూ అమరావతిని విమర్శించరు అంటారా ? నిజమే అశుద్ధం తినేవారే ఇంత క్రూర పరిహాసం చేయగలరు. ప్రశ్నకు ప్రశ్న, దబాయింపు, తిట్లు, శాపనార్థాలు సమాధానం కావు. విభజనకు ముందు-తరువాత రాయలసీమ సమస్యలు, వాటి నేపథ్యం, పరిణామాలపై చర్చ జరగాలి.
- పమిడికాల్వ మధుసూదన్
padhupamidikalva@gmail.com