అందమా...అందుమా!
రూపం...శరీరాకృతి మార్పులకు ఆరాటం
యువతలో వింత పోకడ సమాజంలో విపరీత ధోరణులు
వికటిస్తున్న శస్త్ర చికిత్సలు
రేఖ కాస్త నల్లగా ఉంటుంది. తాను తెల్లగా లేనని... స్నేహితుల్లో ప్రత్యేక గుర్తింపు రావడం లేదని తన లో తాను కుమిలి పోయేది. ఓ రోజు టీవీలో వచ్చిన ‘తెల్లగా మార్చబడును’ అనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. రూ.రెండు లక్షలు వెచ్చించి... ఆ సంస్థ చెప్పిన లేపనాలు ముఖానికి పూసుకుంది. తెల్లగా కావడానికి బదులు మరింత అందవికారంగా తయారైంది.
శేఖర్ పొడవు ఐదడుగులు. తన స్నేహితుల కంటే పొట్టిగా ఉన్నానని... శరీరాకృతి సిక్స్‌ప్యాక్‌లో లేదని నిత్యం బాధపడేవాడు. తాను కోరుకున్నట్టుగా శరీరాకృతిని మారుస్తామన్న ఓ ఆస్పత్రి ప్రకటనను నమ్మాడు. రూ.లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రిలో చేరాడు. తాను కోరుకున్నట్టు జరుగలేదు సరికదా... కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. అందం... ఆకృతి కోసం ఆరాట పడుతున్న ఇలాంటి వారి సంఖ్య నగరంలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
సిటీబ్యూరో: ఆరడుగుల పొడ వు... సిక్స్ ప్యాక్ బాడీ...పొడవైన ముక్కు... తెల్లటి రంగు... ఇలా బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యమిస్తున్న గ్రేటర్ యువత సర్జరీల పేరిట తమను తాము శిక్షించుకుంటున్నారు. దీనిపై సామాజిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రేటర్‌లో ఇలాంటి విపరీత ధోరణులు పెరుగుతున్న తీరు విస్తుగొల్పుతోందని చెబుతున్నారు. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఆర్థికంగా పెనుభారం కావడంతో పాటు.. కుటుంబ సభ్యులకు తీరని బాధనుమిగులుస్తున్నాయని పేర్కొంటున్నారు. తాజాగా గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎత్తు పెరిగేందుకు చేయించుకున్న సర్జరీ సంచలనం సృష్టించిన విషయం విదితమే. ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న శరీర భాగాలను బాగు చేసుకునేందుకు అత్యవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించుకోవడం తప్పు కాదు. అందం కోసం అర్రులు చాస్తూ.. ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్న ధోరణి సరికాదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాము ప్రస్తుతం ఉన్న స్థితిని అంగీకరించకపోవడం (సెల్ఫ్ యాక్సెప్టెన్స్) వంటి ధోరణితో ఇలాంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు.
కౌన్సెలింగ్‌తో మేలు
అందంగా ఉన్న వారితో పోల్చుకొని తమలో తాము మథన పడుతూ..సెల్ఫ్ ఇమేజ్‌ను మార్చుకునేందుకు కొందరు యు వతీ యువకులు ఆరాట పడుతున్నారు. ఇలాంటి వారు శస్త్రచి కిత్సలకు వెనుకాడడం లేదు. వీరిలో ఆత్మవిశ్వాసం పెంచడం, ప్రస్తుతం తాము ఎలా ఉన్నారో అలాగే తమను తా ము అంగీకరించుకునేందుకు కౌన్సెలింగ్ చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు, సినిమాల ప్రభావంతో ఎత్తుగా, తెల్లగా ఉన్నవారే సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారన్న సందేశం యువతలో బలంగా నాటుకుపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ పెడధోరణిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. - వీరేందర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు
గుణం కంటే అందానికే ప్రాధాన్యం
ఇటీవల అమ్మాయిలు.. అబ్బాయిలు గుణం కంటే అందానికే ప్రాధాన్యమిస్తున్నారు. తెల్లగా, ఎత్తుగా ఉండడం వంటి భౌతిక అంశాలతో సా మాజిక హోదా పెరుగుతుందన్న భావన ప్రబలుతోంది. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి భావాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు కూడా అందం కంటే వ్యక్తుల గుణం, నడవడి, సత్ప్రవర్తన వంటి అంశాలకే ప్రాధాన్యమివ్వాలి. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే మిన్న అన్న భావన పెంపొందాలి. - ఆదిరాజు కృష్ణమోహన్‌రావు, సామాజికవేత్త
మనిషిగా గుర్తించే సంస్కృతి పెరగాలి
కుటుంబ, విద్యా వ్యవస్థల్లో మనిషిని మనిషిగా గుర్తించే సంస్కృతిని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటి పెడధోరణులు తగ్గుతాయి. అందం, డబ్బు, టెక్నాలజీ, హోదాలకు పెద్ద పీటవేయడం సరికాదు. పొట్టి వాళ్లయినా విజయం సాధించవచ్చు...అందంగా లేకపోయినా మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవచ్చని యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. - ఆకెళ్లపాటి రాఘవేంద్ర, కెరీర్ గెడైన్స్ నిపుణులు