కిడ్నీ మార్పిడి అనంతరం నిలాధన్, ఆయన భార్య లువాంగ్‌తో డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ‘బి’పాజిటివ్ బ్లడ్‌గ్రూప్ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్’పద్ధతిలో వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను నెఫ్రాలజీ వైద్యనిపుణుడు డాక్టర్ విక్రాంత్‌రెడ్డి వెల్లడించారు. అస్సాంకు చెందిన నిలాధన్ సింఘా(42) కిడ్నీ సంబంధిత సమస్యతో కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు.
వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్రియాటిన్ 16.0 గా నమోదైంది. యాంటీబాడీస్ బాగా తగ్గిపోవడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. స్వీకర్త బ్లడ్ గ్రూప్‌నకు సంబంధించిన దాతలెవరూ కిడ్నీ దానానికి ముందుకు రాలేదు. చివరకు ఆయన భార్య లువాంగ్ సింఘా(37) కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ ‘బి’పాజిటివ్ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్. సాధారణంగా రెండు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్సలు చేయరు. ఒకవేళ చేసినా స్వీకర్త శరీరం దాత అవయవాన్ని తిరస్కరిస్తుంది. చికిత్సకు మరోదారి లేకపోవడంతో వైద్యులు ఏప్రిల్ మొదటివారంలో ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’పద్థతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
Comments
Please login to add a commentAdd a comment