ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి | chellappa, sudheer committee recommendations for telangana muslims and st's | Sakshi
Sakshi News home page

ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి

Published Sat, Aug 13 2016 2:22 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

chellappa, sudheer committee recommendations for telangana muslims and st's

తమ నివేదికల్లో చెల్లప్ప, సుధీర్ కమిషన్ల సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లింలలోని పేద వర్గాలు, షెడ్యూల్డ్ తెగల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెల్లప్ప, సుధీర్ కమిషన్లను తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు రిజర్వేషన్ల పెంపుతోపాటు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిలో సొంతంగా వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీలు అందజేయాలని కమిషన్లు ప్రతిపాదించాయి.

రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం, ముస్లింలకు 4 శాతం (బీసీ ఈ కేటగిరీలో) రిజర్వేషన్లు కొనసాగుతుండగా.. వాటిని 12 శాతానికి చొప్పున పెంచుతామని టీఆర్‌ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని చూపేందుకు, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు గణాంకాలు, సమాచారం అవసరమైంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా.. దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని రిజర్వేషన్ల పెంపునకు పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలపై అధ్యయనం చేసేందుకు ఎస్టీ, మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేసింది.
 
కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను కలిపితే..
రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం, వారి పరిస్థితులతోపాటు కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలిపితే పరిస్థితి ఏమిటనే అంశంపై చెల్లప్ప కమిషన్ పరిశీలన జరిపింది. ఈ వర్గాలను ఎస్టీల్లో కలిపితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాల్లో కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలు నివసించే ప్రాంతాలతో పాటు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ప్రయత్నించింది. జిల్లాల్లో ఈ రెండింటిని ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనను వివిధ ఎస్టీ సంఘాలు, నాయకులు వ్యతిరేకించారు. 

దేశవ్యాప్తంగా ఆయా తెగలు ఏయే జాబితాల్లో ఉన్నాయన్న అంశాన్ని కమిషన్ పరిశీలించింది. ఇతర ఎస్టీ తెగలతో పోల్చితే.. ఈ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతికంగా,  సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసింది.  కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలకు సంబంధించి చారిత్రక ఆధారాలు, కచ్చితమైన సమాచారం, గణాంకాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఆదుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.  ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 % వరకు రిజర్వేషన్లను కల్పించవచ్చునని ప్రతిపాదించింది.
 
ముస్లింల స్థితిగతులు ఘోరం

రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు  దారుణంగా ఉన్నాయని సుధీర్ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది నుంచి 46 అంశాలపై శాంపిల్ సర్వే ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటు ఎక్కువగా ఉందనే అంచనాకు కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. పేద ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదికలో సూచించినట్లు సమాచారం. ముస్లిం  పిల్లలకు అన్ని స్థాయిల్లో గురుకుల విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీ అందించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. చదువుకున్న వారికి ఉద్యోగాలు లభించే ఏర్పాటు చేయాలని.. బలహీనవర్గాల గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement