కళ్యాణ్-శ్రీజ జంటగా ఇలా..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి కబుర్లు రోజుకొకటి వార్తల్లో నిలుస్తున్నాయి. చిరంజీవికి కాబోయే చిన్నల్లుడు ఎట్టకేలకు వెలుగులోకి వచ్చాడు. నిన్న మొన్నటివరకూ శ్రీజకు కాబోయే వరుడు కళ్యాణ్ ఇతడేనంటా అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్-శ్రీజ జంటగా ఉన్న ఫొటోను ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. దీంతో శ్రీజ పెళ్లి వార్తను చిరంజీవి ఫ్యామిలీ అధికారికంగా కన్ఫామ్ చేసినట్టయింది.
ఇక వరుడు కనుగంటి కళ్యాణ్ ఎన్నారై ఫ్యామిలీ అని తొలుతు వార్తలు వచ్చినా... అతని తల్లిదండ్రులు కెప్టెన్ కృష్ణ, జ్యోతి హైదరాబాద్కు చెందినవారేనని వధువరుల సన్నిహితులు తెలిపారు. కళ్యాణ్ బిట్స్ ఫిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 'కళ్యాణ్, శ్రీజలకు ఒకరిపై ఒకరికి చక్కని అవగాహన ఉంది. వియ్యం అందుకుంటున్న ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి' అని సన్నిహితులు వెల్లడించారు. కాగా ఈ వివాహం ఎక్కడ జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. పెళ్లి వేడుకను హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నా, ఆ తర్వాత వేదిక మారినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో రెండు కుటుంబాలు గోప్యత పాటిస్తున్నాయి.