
29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో తారల సందడి
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలన చిత్రసీమ ముందుకొచ్చింది. ‘మేము సైతం’ పేరుతో ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో సినీ తారలతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా విరాళాలు సేకరించి సీఎం సహాయనిధికి అందజేయనుంది. ఈ క్రమంలో 29వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో ‘తారలతో విందు’ నిర్వహించనున్నారు.
ఇందులో పాల్గొనదలచిన జంటలు.. ఒక్కో జంట టికెట్ ఖరీదు కింద రూ. లక్ష వంతున విరాళం అందజేయాల్సి ఉంటుంది. ఇక 30న ఉదయం నుంచి రాత్రి వరకు అన్నపూర్ణా స్టూడియోలో వినోద కార్యక్రమాలు ఉంటాయి. వీటికి హాజరు కాదలచినవారు రూ. 500 చొప్పున చెల్లించి టికెట్‌ను కొనుగోలు చేయాలి.