
ఒక్కో చోట ఒక్కో ‘పేరు’!
చెలామణి అయిన ‘రూర్కెలా’ ఉగ్రవాదులు
ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నివాసాలు
తెలంగాణలో వీరిపై నాలుగు కేసులు
పీటీ వారెంట్‌పై తేవాలని నిర్ణయం
నేడో, రేపు చేరుకోనున్న ముష్కరమూక
సిటీబ్యూరో: తెలంగాణ, ఒడిస్సా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో బుధవారం రూర్కెలాలో చిక్కిన సిమి ఉగ్రవాదుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సభ్యులు హతమైన తర్వాత ఈ ముఠా ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అంతా ఒకే కుటుంబంగా, ఒక్కో చోట ఒక్కో వృత్తి పేరు చెప్తూ చెలామణి అయ్యారని స్పష్టమైంది. రూర్కెలాలో చిక్కిన షేక్ మహబూబ్, అంజద్ ఖాన్, జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్‌లను వివిధ ఏజెన్సీలకు చెందిన బృందాలు ప్రశ్నిస్తున్నాయి. జానకీపురం ఎన్‌కౌంటర్‌కు కొన్ని రోజుల ముందు తెలంగాణకు వచ్చిన ఎజాజుద్దీన్, అస్లం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఉన్న ప్రభుత్వ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో తాము పాత వస్త్రాల వ్యాపారం చేస్తామని, త్వరలోనే కుటుంబసభ్యులు వస్తారంటూ యజమానితో చెప్పారు. వీరిద్దరూ రెక్కీ కోసం విజయవాడకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే జానకీపురం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఉదంతం జరిగినప్పుడు మిగిలిన నలుగురు ఉగ్రవాదులతో పాటు మహబూబ్ తల్లి నజ్మాబీవీ పశ్చిమ ఒడిస్సాలోని సంబల్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఎన్‌కౌంటర్ విషయం తెలియడంతోనే అక్కడ నుంచి జార్ఖండ్‌లోని జంషెడ్పూర్‌కు మకాం మార్చారు.
కొన్ని రోజులకే ఒడిస్సాలోని భద్రక్ పట్టణానికి వచ్చి కార్పెంటర్లమంటూ నాన్గమొహల్లా ప్రాంతంలో ఉన్న మున్నా ఖాన్ ఇంట్లో అద్దెకు దిగారు. నెలకు రూ.వెయ్యి చొప్పున అద్దె ఒప్పందం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో అక్కడ నుంచి రాంచీకి వెళ్లి కొన్ని రోజుల పాటు నివసించారు. ఆపై రూర్కిలాలోని నాలా రోడ్‌లో ఉన్న ఖురేషీ మొహల్లాకు వచ్చి పూల వ్యాపారులమంటూ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రూర్కెలాలో చిక్కిన ముష్కరులపై ఇప్పటి వరకు తెలంగాణలో నాలుగు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులకు సంబంధించి షేక్ మహబూబ్, అంజద్ ఖాన్, జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్‌లను ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకువచ్చి విచారించడానికి పోలీ సులు సన్నాహాలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో నలుగురు ముష్కరుల్నీ తీసుకువచ్చే అవకాశం ఉంది.