ఆ బుడ్డోడు మగాడ్రా బుజ్జీ!
అర్ధరాత్రి సమయంలో కుక్కలు కాసింత మొరుగుతూనే గుండెలు గుబేల్మంటాయి. అలాంటిది ఏకంగా ఐదు కుక్కలు చుట్టుముట్టి దాడికి సిద్ధపడితే.. పెద్దవాళ్ల గుండెలు సైతం జారిపోతాయి. ఇలాంటి విషమపరిస్థితిలోనూ ఓ బుడ్డోడు మొక్కవోని తెగువను ప్రదర్శించాడు. ఉత్త చేతులతో కుక్కలు అదిలించి.. బెదిరించి.. ఒక్క కాటు కూడా పడకుండా అక్కడినుంచి సురక్షితంగా బయటపెట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జీ అనే రేంజ్‌లో వీరోచితంగా గ్రామసింహాలకు గుబులు పుట్టించాడు. వీడేం పిల్లడ్రా బాబు అని శునకాలే విస్తుపోయేలా హీరోయిజం ప్రదర్శించిన ఆ బుడతడే చందు.. ఇప్పుడు స్థానికంగా అతను హీరోగా మారిపోయాడు.
గత శనివారం రాత్రి హైదరాబాద్ మూసాపేట్‌లోని ఆంజనేయనగర్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. దీంతో చందు సాహసం తెలుసుకొని కుటుంబసభ్యులు, బస్తీవాసులు కొనియాడుతున్నారు. శ్రీకాకుళం ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కొడుకు చందు. కృష్ణ కుటుంబం ముసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో ఉంటోంది. మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగిందని, ఆ సమయంలో తన చెల్లి కూతురు పూజతో కలిసి చందు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తండ్రి కృష్ణ చెప్పాడు. తమ ఇంటికి సమీపంలోని చిన్న గల్లీలో పూజ-చందు వెళుతుండగా.. ఓ వీధికుక్కల గుంపు చుట్టుముట్టిందని, వాటిని ధైర్యంగా తరిమేసి.. చందు సురక్షితంగా బయటపడగలిగాడని చెప్పాడు.
రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ
వీధికుక్కలతో పోరాడి బుడతడు చందు సురక్షితంగా బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలో నిత్యం వేధిస్తున్న కుక్కల బెడద విషయంలో ఎక్కడ విమర్శలు వస్తాయోనని జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. వీధుల్లో విహారం చేస్తున్న కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ నగరంలోని పలు ప్రాంతాల్లో రంగంలోకి దింపింది.