musapet
-
కరోనా కాలంలో ఆదర్శంగా నిలుస్తున్న అపార్ట్మెంట్..
మూసాపేట: కొన్ని సరదాలు... సంతోషాలు... కొన్ని రోజులు పక్కనపెట్టి ... కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా దరిదాపుల్లోకి రాదని ఆ అపార్ట్‌మెంట్‌వాసులు పేర్కొంటున్నారు. 60 ప్లాట్స్ ఉన్నా ఈ అపార్ట్మెంట్లో ఇప్పటి వరకు 7 కుటుంబాల వారు మాత్రమే కరోనా బారిన పడ్డారంటే వారు పాటిస్తున్న నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదు. చిన్నారుల పార్కు, జిమ్‌లు బంద్ చేశారు. ఉమ్మడిగా చేసుకునే పండగలు, పార్టీలు పక్కన పెట్టారు. చిన్నారులను కూడా ఇళ్లలోనే ఆడిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే కరోనాను తరిమి వేయవచ్చని, ఆ తర్వాత సంతోషంగా ఉండవచ్చని బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ప్రగతీనగర్ కాలనీ చివరన ఉన్న ఎంజేఆర్ సొలిటర్ అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. ఎంజేఆర్ సొలిటర్ అపార్ట్మెంట్లో 80 ప్లాట్స్, 250కి పైగా జనాభా ఉన్నారు. ఆన్లైన్ ఫుడ్స్, డోర్ డెలివరీస్ సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాలి. ఆ తర్వాత వారు ప్లాట్ ఓనర్‌కు అందజేస్తారు. కొత్తవాళ్లు లోపలికి ప్రవేశం లేదు. తెలిసిన వాళ్లయినా, అపార్ట్మెంట్ వాసులైనా గేట్ వద్ద టెంపరేచర్ చూసి, శానిటేషన్ చేసి లోపలికి పంపిస్తారు. చిన్నారులు ఆడుకునే పార్కు జిమ్ ప్రస్తుతం మూసివేశారు. చిన్నారులను ఇళ్లల్లోనా ఆడించుకుంటున్నారు. కారిడార్‌లో ముచ్చట్లు లేవు. శ్రీరామనవమి,ఉగాది వంటి పండగలు, పుట్టిన రోజు ఇతర పార్టీలు బంద్ చేశారు. ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకొంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం లిఫ్ట్, ఫ్లోర్స్, కారిడార్లను శానిటేషన్ చేయిస్తున్నారు. చివరికి కూరగాయలు వారానికి రెండు సార్లు అపార్ట్‌మెంట్‌కు వచ్చి విక్రయిస్తారు. అతనికి కూడా టెంపరేచర్, శానిటేషన్ చేసి పంపిస్తారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి సమాచారాన్ని అడుగుతూ వారికి కావాల్సిన సహాయం అందజేస్తున్నారు. చదవండి: ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న హైదరాబాద్ సాప్ట్ వేర్ ఉద్యోగి -
ట్రక్కులు పార్కు చేసే ఆ స్థలం ధర రూ. 600 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున్న ఉన్న మూసాపేట భూములు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇక్కడి 28 ఎకరాల స్థలంలో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ (టీవోడీ)లో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తొలుత భావించినా ఆ నిర్ణయంపై హెచ్ఎండీఏ అడుగు వెనక్కి వేసింది. ఈ భూమిని విక్రయించడం ద్వారా దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీన్ని వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ స్థల విక్రయంతో వచ్చే ఆదాయం ద్వారా బాలానగర్ భారీ ఫ్లైఓవర్, హుస్సేన్‌సాగర్ సుందరీకరణ, ఔటర్ రింగ్ రోడ్డుపై పూర్తిస్థాయిలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు తదితర ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం రైతుల నుంచి 28 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఈ స్థలంలో ట్రక్కులు పార్క్ చేస్తున్నారు. నగరానికి అవసరమయ్యే వివిధ వస్తువులు, సరుకులు తీసుకొచ్చే ఈ భారీ వాహనాల నుంచి డబ్బులు ఏమాత్రం వసూలు చేయకుండా నిలిపేందుకు అనుమతించారు. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాంతంగా మారడంతో భూమికి ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. దీనికితోడు భారీ వాహనాలు నగరంలోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందనే కారణంతో మూసాపేటలో పార్కింగ్ చేస్తున్న ట్రక్కులను శివారు ప్రాంతానికి పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే ట్రక్కు యజమానులందరికీ సూచించిన హెచ్ఎండీఏ అధికారులు తొలుత పటాన్‌చెరులోని ఐదు ఎకరాల్లో వాహనాలు పార్క్ చేయడంతో పాటు డ్రైవర్లకు అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వహణ భారం అవుతుందనే స్వస్తి ఇక మూసాపేటలోని 28 ఎకరాల భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని పొందాలని చూసిన..వాటి నిర్వహణ భారమవుతుందని ఈ యోచనకు స్వస్తి పలికారు. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఉన్న వాణిజ్య సముదాయాల్లో అనేక గదులు ఖాళీగా ఉండటం ద్వారా భారీ మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. దీనికితోడు అదనంగా నిర్వహణ భారంగా ఉండటంతో చేతుల నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కంటే ఆ భూమిని విక్రయించగా వచ్చే ఆదాయంతో అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉండడంతో వచ్చే నిర్ణయాన్ని బట్టి ముందుకెళతామని ఓ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: కిక్కిరిసిన ఐటీజోన్: ఈ కష్టాలు తప్పవు మరి! -
పేట్రేగుతున్న పెట్రోల్ దొంగలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నగదు, నగలు, సెల్ఫోన్ల చోరీ... ఇళ్లు, ఏటీఎంల లూటీ వంటి ఘటనలను గురించి రోజూ మనం వింటూ ఉంటాం.. అయితే, ఇవి కొంత కష్టంతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో.. దొంగలు రూట్ మార్చి పెట్రోల్ చోరీలు మొదలెట్టారు. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గెట్ చేసి వాటిలోని ఇంధనాన్ని అపహరిస్తున్నారు. మూసాపేటలో పెట్రోల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి వాటిలోని పెట్రోల్ చోరీ చేస్తున్నారు. రాత్రి 11 గంటల తర్వాత పెట్రోల్ చోరీలకు పాల్పడుతున్నారు. తమ బండిలోని పెట్రోల్ పోయిందన్న విషయాన్ని మరొకరికి చెప్పుకోలేక, రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో తమ బండిలో మళ్లీ పెట్రోల్ కొట్టించుకోలేక పేదలు అవస్థలు డుతున్నారు. మూసాపేటలోని గూడ్స్‌షెడ్ రోడ్డు, జనతానగర్, యాదవబస్తీ, ముష్కిపేట, వడ్డెర బస్తీ, వార్డు కార్యాలయం, అంజయ్యనగర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయి. మూసాపేటలోని పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తులు ఉన్నప్పటికీ కార్లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేసేందుకు సౌకర్యం లేదు. దీంతో ఆరు బయటే పార్కింగ్ చేస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు బైకుల్లోని పెట్రోల్‌ను ఎత్తుకెళ్తున్నారు. మూసాపేటలోని ఇరుకు గదుల్లో నివాసముంటూ కూలీపని చేసుకుంటూ, పరిశ్రమల్లో కష్టపడి పని చేస్తే రోజు గడుస్తుంది. అలాంటి వారికి పెట్రోల్ చోరీ పెనుభారంగా మారింది. రాత్రి పార్కింగ్ చేసిన వాహనాన్ని ఉదయం స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా వాహనం కదలడం లేదు. అనుమానం వచ్చి ట్యాంకులో పరిశీలిస్తే చుక్క పెట్రోల్ కూడా ఉండటంలేదు. తమ అవసరం కోసం ఎవరైనా పెట్రోల్ దొంగతనం చేసినా, లేక ఆకతాయిలు సరదాగా చోరీ చేసినా వాహనదారులు మాత్రం పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెట్రోల్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పెట్రోల్ చోరీ అంటడంతో సామాన్యులకు భారంగా మారింది. పెట్రోల్ ధరలు పెరగటం కూడా చోరీలు జరగడానికి మరో కారణంగా మారుతోంది. పెట్రోల్ తీయటానికి ఇబ్బందిగా ఉంటే వాహనాలను పగులగొట్టి మరీ పెట్రోల్‌ను చోరీ చేస్తున్నారు. సమయానికి ఆసుపత్రికి వెళ్లలేకపోయాం... రాత్రి వాహనాన్ని పార్కింగ్ చేసి నిద్రపోయాం. తెల్లవారుజామున ఇంట్లో వైద్య సమస్య వల్ల ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బైక్‌ను తీయటానికి వెళ్తే అది స్టార్ట్ కాలేదు. పరిశీలించగా పెట్రోల్ లేదు. బైక్‌లో రాత్రే పెట్రోల్ పోయించుకున్నా. కానీ స్టార్ట్ కాకపోవటంతో ఆసుపత్రికి సమయానికి వెళ్లలేక పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దొంగలు పెట్రోల్ చోరీ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితిని మానవత్వంతో ఆలోచించాలని కోరుతున్నా. –భీముడు, మూసాపేట లాక్ పగులగొట్టి మరీ చోరీ చేశారు... కొత్తగా మూసాపేటకు అద్దెకు వచ్చాం. వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. అందరిలాగే నా వాహనాన్ని కూడా రోడ్డుపై పార్కింగ్ చేశా. పెట్రోల్ తీయకుండా ఇంతకు ముందే పెట్రోల్ లాక్ వేశా. కానీ దొంగలు పగులగొట్టి పెట్రోల్ మొత్తాని చోరీ చేశారు. అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు నా బైక్‌లోని పెట్రోల్‌ను బాటిల్లో తీసి తిరిగి ఉదయాన్నే మళ్లీ వాహనంలో నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. –బీచ్పల్లి, మూసాపేట -
భూమంత్రం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే నగరంతో పాటు శివారు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ‘విశ్వ’ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఖజానా నింపుకొనేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. మియాపూర్‌లోని ప్రతిపాదిత ఇంటర్ సిటీ బస్ టర్మినల్, బాలానగర్ భారీ ఫ్లైఓవర్, బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్ హబ్‌లు, కొత్వాల్‌గూడలో ఏకో టూరిజం పార్కు, హుస్సేన్‌సాగర్ సుందరీకరణ, ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు వంటి అనేక ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న హెచ్ఎండీఏ.. వాటికయ్యే వ్యయానికి కావాల్సిన కాసులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉప్పల్ భగాయత్ ప్లాట్లు వేలం వేయాలని, హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే–అవుట్లలోని స్ట్రయిట్ బీట్ భూములు విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. వీటి ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తున్న బోర్డు, నగరంలోని కీలక ప్రాంతమైన మూసాపేటలోని 28 ఎకరాల స్థలాన్ని విక్రయిస్తే ఒకేసారి రూ.500 కోట్ల నిధులు వస్తాయని భావిస్తోంది. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని తొలుత భావించినా అది పెట్టుబడితో కూడిన వ్యవహారం కావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. శివారు భూములు విక్రయిస్తే బెటర్ నగరానికి శివారులో 30 ఏళ్ల క్రితం హెచ్ఎండీఏ రైతుల నుంచి 28 ఎకరాలస్థలాన్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ స్థలంలో ట్రక్కులు పార్క్ చేస్తున్నారు. నగరానికి అవసరమయ్యే వివిధ వస్తువులు, సరుకులు తీసుకొచ్చే ఈ భారీ వాహనాల నుంచి డబ్బులు ఏమాత్రం వసూలు చేయకుండా నిలుపుకునేలా అనుమతిచ్చింది. అయితే, గతంలో శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధిలో కీలకంగా మారింది. దీంతో ఈ భూమికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికితోడు భారీ వాహనాలు నగరంలోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందనే కారణంతో మూసాపేటలో పార్కింగ్ చేస్తున్న ట్రక్కులను శివారు ప్రాంతమైన పటాన్‌చెరువులో హెచ్ఎండీఏకు ప్రభుత్వం కేటాయించిన 18 ఎకరాల్లో పార్క్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్కు యజమానులందరికీ సమాచారం ఇచ్చిన హెచ్ఎండీఏ అధికారులు తొలుత పటాన్‌చెరులోని ఐదు ఎకరాల్లో వాహనాలు పార్క్ చేయడంతో పాటు డ్రైవర్లకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. అయితే, మియాపూర్‌లోని 28 ఎకరాల భూమిలో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ (టీఓడీ)లో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావించింది. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఉన్న వాణిజ్య సముదాయాల్లో అనేక గదులు ఖాళీగా ఉండి భారీ మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. దీనికితోడు అదనంగా వాటి నిర్వహణ భారంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కంటే ఆ భూమిని విక్రయించగా వచ్చే ఆదాయంతో శివారుల్లో భూమి కొనుగోలు చేయడం, లేదంటే అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. త్వరలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మూసాపేట భూమిని విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పటాన్చెరులో పార్కింగ్ సిద్ధం రామచంద్రపురం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి మీదుగా రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ మార్గాల్లో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందిన, క్షతగాత్రులైన ఘటనలున్నాయి. దీనికితోడు రాత్రి సమయాల్లో లోడుతో వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఇటు ట్రక్ల అతివేగం, అటు మెట్రోరైలు పనుల వల్ల ఇతర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూసాపేటలో ట్రక్కుల పార్కింగ్ వల్ల సంస్థకు నయాపైసా ఆదాయం లేకపోవడం కూడా హెచ్ఎండీఏను ఆలోచనలో పడేసింది. దీంతో ట్రక్కు పార్కింగ్ కోసం పటాన్చెరులో హెచ్ఎండీఏ స్థలాన్ని కేటాయించి చకచక వసతులను కల్పించింది. సాధ్యమైనంత త్వరలో అక్కడే ట్రక్కులు పార్క్ చేయనున్నారు. -
చక్రాపూర్‌లో చిరుత కలకలం
మూసాపేట (దేవరకద్ర) : మండలంలోని చక్రాపూర్ గ్రామంలో చిరుత పులి వరుస దాడులతో కలకలం సృష్టిస్తోంది. గ్రామ శివారులోని అడవిలో గత కొన్ని నెలల నుంచి చిరుత పులి సంచరి స్తూ.. మూగజీవాలపై దాడి చేస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా వరుస దాడులు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పంటలకు కాపలా వెళ్లి అడవి జంతువుల బారి నుంచి కాపాడుకోలేక.. మరో పక్క చేసిన అప్పులను తీర్చలేక లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలానికి వెళ్లడానికే జంకుతున్నారు. అడవులకు అతి సమీపంలో.. చిరుతపులి గడిచిన నాలుగు నెలల్లో 6 మేకలు, రెండు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. చక్రాపూర్ గ్రామానికి, సమీపంలోని తండాలకు అడవులు దగ్గరగా ఉండటంతో తరచూ చిరుత సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన హరిజన్ కుర్మయ్య, మాసన్న, కావలి తిరుమలయ్యకు చెందిన మేకలను చంపి ఎత్తుకెళ్లగా.. తిరుమలి ఎర్రన్నకు చెందిన లేగ దూడను కూడా చంపడం కలకలం రేపుతోంది. ఇన్ని రోజుల నుంచి అడవిలో పందులు, ఎలుగుబంట్లు, నక్కల సంచారం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు చిరుత సంచారంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం ఎక్కువైందని వాపోయారు. గ్రామస్తులకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా కూడా జంకుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే రాత్రివేళల్లో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు స్పందించి చిరుత పులిని బంధించి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి కోసం వచ్చింది చిరుత పులులు ఎప్పుడూ అడవిలోనే తిరుగుతాయి. ప్రస్తుతం ఈ అడవిలో ఒకే ఒక్క చిరుత ఉంది. దానికి తాగునీరు దొరకక.. గ్రామ సమీపంలోకి వచ్చి పశువులపై దాడి చేసి ఉంటుంది. చుట్టుపక్కల పొలాల దగ్గర ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి «æదాహం వేసినప్పుడు ఎవరి మీదైనా దాడి చేస్తాయి. అడవిలో చిరుత కోసం తొట్లు ఏర్పా టు చేసి నీళ్లు పోస్తున్నాం. మేకపోతు చిరుత దాడిలో మృతిచెందింది. కాబట్టి నష్టపరిహారం చెల్లించేలా చూస్తాను. – నరేందర్, బీట్ ఆఫీసర్, మూసాపేట మమ్మల్ని పట్టించుకోరా? ప్రతినిత్యం మూగజీవాలైన పశువులు, మేకలు, గొర్రెలను కాపరులు గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్తున్నా కూడా వాటికి సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. అడవిలో ఉన్న వనరులతో కనీస అవసరాలైన కట్టెలు, రాళ్లు, ఇసుక ఇలా ఏదో ఒకటి గ్రామానికి తీసుకువచ్చిన కూడా అటవీ శాఖాధికారులు మాత్రం వారిపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప ఇలా అటవీ జంతువులు మూగజీవాలపై దాడులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అడవిలో సిమెంట్ రింగులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోయడం ఎంత వరకు సబబని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ బుడ్డోడు మగాడ్రా బుజ్జీ!
అర్ధరాత్రి సమయంలో కుక్కలు కాసింత మొరుగుతూనే గుండెలు గుబేల్‌మంటాయి. అలాంటిది ఏకంగా ఐదు కుక్కలు చుట్టుముట్టి దాడికి సిద్ధపడితే.. పెద్దవాళ్ల గుండెలు సైతం జారిపోతాయి. ఇలాంటి విషమపరిస్థితిలోనూ ఓ బుడ్డోడు మొక్కవోని తెగువను ప్రదర్శించాడు. ఉత్త చేతులతో కుక్కలు అదిలించి.. బెదిరించి.. ఒక్క కాటు కూడా పడకుండా అక్కడినుంచి సురక్షితంగా బయటపెట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జీ అనే రేంజ్లో వీరోచితంగా గ్రామసింహాలకు గుబులు పుట్టించాడు. వీడేం పిల్లడ్రా బాబు అని శునకాలే విస్తుపోయేలా హీరోయిజం ప్రదర్శించిన ఆ బుడతడే చందు.. ఇప్పుడు స్థానికంగా అతను హీరోగా మారిపోయాడు. గత శనివారం రాత్రి హైదరాబాద్ మూసాపేట్‌లోని ఆంజనేయనగర్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారిపోయింది. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. దీంతో చందు సాహసం తెలుసుకొని కుటుంబసభ్యులు, బస్తీవాసులు కొనియాడుతున్నారు. శ్రీకాకుళం ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కొడుకు చందు. కృష్ణ కుటుంబం ముసాపేటలోని శ్రీకాకుళం బస్తీలో ఉంటోంది. మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగిందని, ఆ సమయంలో తన చెల్లి కూతురు పూజతో కలిసి చందు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తండ్రి కృష్ణ చెప్పాడు. తమ ఇంటికి సమీపంలోని చిన్న గల్లీలో పూజ-చందు వెళుతుండగా.. ఓ వీధికుక్కల గుంపు చుట్టుముట్టిందని, వాటిని ధైర్యంగా తరిమేసి.. చందు సురక్షితంగా బయటపడగలిగాడని చెప్పాడు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వీధికుక్కలతో పోరాడి బుడతడు చందు సురక్షితంగా బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలో నిత్యం వేధిస్తున్న కుక్కల బెడద విషయంలో ఎక్కడ విమర్శలు వస్తాయోనని జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. వీధుల్లో విహారం చేస్తున్న కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ నగరంలోని పలు ప్రాంతాల్లో రంగంలోకి దింపింది. -
ఆ బుడ్డోడు మగాడ్రా బుజ్జీ!
-
మూసాపేటలో డీసీఎం బీభత్సం
హైదారాబాద్: నగరంలోని మూసాపేట ఐడీఎల్ చెరువు కట్టపై ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జ్యోతి(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. రమ, ఉష, పుష్ప, కిశోర్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
'ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యమివ్వండి'
అడ్డాకుల (మహబూబ్‌నగర్ జిల్లా) : 'మిషన్ కాకతీయ' పనుల్లో ప్రజలకు ఉపయోగపడే కాలువల మరమ్మతుల లాంటి అత్యవసరమైన పనులకు ప్రాధాన్యమివ్వాలని నీటిపారుదలశాఖ ఈఈ విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన వనపర్తికి వెళ్లే ముందు మూసాపేట చౌట చెరువు నుంచి విడుదలయ్యే వరద నీళ్లు కొమిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే కొత్త కాలువను ఈఈ పరిశీలించారు. కాలువ పూర్తిగా పూడిపోయిన నేపథ్యంలో మురుగు నీళ్లు కాలువలోంచి ముందుకు వెళ్లే వీలే లేదు. దీంతో కాలువను బాగు చేయిస్తే మురుగు నీళ్లు ఇళ్ల సమీపాల్లో నిలువ ఉండకుండా చేసే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ ఏఈ జయరామ్ ఈఈ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాలువను పరిశీలించారు. కాలువ సమీపంలో ఉన్న ఇళ్ల చుట్టూ నిలిచిన మురుగు నీళ్లను చూసి స్థానికులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మురుగు నీళ్ల మూలంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూసి ఈఈ చలించిపోయారు. కాలువను బాగు చేయించడానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇళ్ల నుంచి నీళ్లు కాలువలోకి వచ్చేలా కొత్తగా ఓ కాలువను తీయించే విధంగా చూడాలని ఏఈకి సూచించారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పనులను నాణ్యవంతంగా చేయించాలని చెప్పారు. మిషన్ కాకతీయ పనుల్లో రైతులతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని చేయించే విధంగా కృషి చేయాలని సూచించారు.