సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే నగరంతో పాటు శివారు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ‘విశ్వ’ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానా నింపుకొనేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. మియాపూర్‌లోని ప్రతిపాదిత ఇంటర్ సిటీ బస్ టర్మినల్, బాలానగర్ భారీ ఫ్లైఓవర్, బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్ హబ్‌లు, కొత్వాల్‌గూడలో ఏకో టూరిజం పార్కు, హుస్సేన్‌సాగర్ సుందరీకరణ, ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు వంటి అనేక ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న హెచ్‌ఎండీఏ.. వాటికయ్యే వ్యయానికి కావాల్సిన కాసులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉప్పల్ భగాయత్ ప్లాట్లు వేలం వేయాలని, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లే–అవుట్లలోని స్ట్రయిట్ బీట్ భూములు విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. వీటి ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తున్న బోర్డు, నగరంలోని కీలక ప్రాంతమైన మూసాపేటలోని 28 ఎకరాల స్థలాన్ని విక్రయిస్తే ఒకేసారి రూ.500 కోట్ల నిధులు వస్తాయని భావిస్తోంది. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని తొలుత భావించినా అది పెట్టుబడితో కూడిన వ్యవహారం కావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.
శివారు భూములు విక్రయిస్తే బెటర్
నగరానికి శివారులో 30 ఏళ్ల క్రితం హెచ్‌ఎండీఏ రైతుల నుంచి 28 ఎకరాలస్థలాన్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ స్థలంలో ట్రక్కులు పార్క్ చేస్తున్నారు. నగరానికి అవసరమయ్యే వివిధ వస్తువులు, సరుకులు తీసుకొచ్చే ఈ భారీ వాహనాల నుంచి డబ్బులు ఏమాత్రం వసూలు చేయకుండా నిలుపుకునేలా అనుమతిచ్చింది. అయితే, గతంలో శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధిలో కీలకంగా మారింది. దీంతో ఈ భూమికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికితోడు భారీ వాహనాలు నగరంలోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందనే కారణంతో మూసాపేటలో పార్కింగ్ చేస్తున్న ట్రక్కులను శివారు ప్రాంతమైన పటాన్‌చెరువులో హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం కేటాయించిన 18 ఎకరాల్లో పార్క్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్కు యజమానులందరికీ సమాచారం ఇచ్చిన హెచ్‌ఎండీఏ అధికారులు తొలుత పటాన్‌చెరులోని ఐదు ఎకరాల్లో వాహనాలు పార్క్ చేయడంతో పాటు డ్రైవర్లకు అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. అయితే, మియాపూర్‌లోని 28 ఎకరాల భూమిలో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్‌మెంట్ (టీఓడీ)లో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావించింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఉన్న వాణిజ్య సముదాయాల్లో అనేక గదులు ఖాళీగా ఉండి భారీ మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. దీనికితోడు అదనంగా వాటి నిర్వహణ భారంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కంటే ఆ భూమిని విక్రయించగా వచ్చే ఆదాయంతో శివారుల్లో భూమి కొనుగోలు చేయడం, లేదంటే అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. త్వరలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మూసాపేట భూమిని విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
పటాన్‌చెరులో పార్కింగ్ సిద్ధం
రామచంద్రపురం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి మీదుగా రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ మార్గాల్లో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందిన, క్షతగాత్రులైన ఘటనలున్నాయి. దీనికితోడు రాత్రి సమయాల్లో లోడుతో వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఇటు ట్రక్‌ల అతివేగం, అటు మెట్రోరైలు పనుల వల్ల ఇతర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూసాపేటలో ట్రక్కుల పార్కింగ్ వల్ల సంస్థకు నయాపైసా ఆదాయం లేకపోవడం కూడా హెచ్‌ఎండీఏను ఆలోచనలో పడేసింది. దీంతో ట్రక్కు పార్కింగ్ కోసం పటాన్‌చెరులో హెచ్‌ఎండీఏ స్థలాన్ని కేటాయించి చకచక వసతులను కల్పించింది. సాధ్యమైనంత త్వరలో అక్కడే ట్రక్కులు పార్క్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment