సాక్షి, హైదరాబాద్ : నగరంలో నగదు, నగలు, సెల్‌ఫోన్ల చోరీ... ఇళ్లు, ఏటీఎంల లూటీ వంటి ఘటనలను గురించి రోజూ మనం వింటూ ఉంటాం.. అయితే, ఇవి కొంత కష్టంతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో.. దొంగలు రూట్ మార్చి పెట్రోల్ చోరీలు మొదలెట్టారు. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గెట్ చేసి వాటిలోని ఇంధనాన్ని అపహరిస్తున్నారు.
- మూసాపేటలో పెట్రోల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఉన్న ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి వాటిలోని పెట్రోల్ చోరీ చేస్తున్నారు.
- రాత్రి 11 గంటల తర్వాత పెట్రోల్ చోరీలకు పాల్పడుతున్నారు.
- తమ బండిలోని పెట్రోల్ పోయిందన్న విషయాన్ని మరొకరికి చెప్పుకోలేక, రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో తమ బండిలో మళ్లీ పెట్రోల్ కొట్టించుకోలేక పేదలు అవస్థలు డుతున్నారు.
- మూసాపేటలోని గూడ్స్‌షెడ్ రోడ్డు, జనతానగర్, యాదవబస్తీ, ముష్కిపేట, వడ్డెర బస్తీ, వార్డు కార్యాలయం, అంజయ్యనగర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయి.
- మూసాపేటలోని పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తులు ఉన్నప్పటికీ కార్లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేసేందుకు సౌకర్యం లేదు. దీంతో ఆరు బయటే పార్కింగ్ చేస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు బైకుల్లోని పెట్రోల్‌ను ఎత్తుకెళ్తున్నారు.
- మూసాపేటలోని ఇరుకు గదుల్లో నివాసముంటూ కూలీపని చేసుకుంటూ, పరిశ్రమల్లో కష్టపడి పని చేస్తే రోజు గడుస్తుంది. అలాంటి వారికి పెట్రోల్ చోరీ పెనుభారంగా మారింది.
- రాత్రి పార్కింగ్ చేసిన వాహనాన్ని ఉదయం స్టార్ట్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా వాహనం కదలడం లేదు. అనుమానం వచ్చి ట్యాంకులో పరిశీలిస్తే చుక్క పెట్రోల్ కూడా ఉండటంలేదు.
- తమ అవసరం కోసం ఎవరైనా పెట్రోల్ దొంగతనం చేసినా, లేక ఆకతాయిలు సరదాగా చోరీ చేసినా వాహనదారులు మాత్రం పలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
- పెట్రోల్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో పెట్రోల్ చోరీ అంటడంతో సామాన్యులకు భారంగా మారింది.
- పెట్రోల్ ధరలు పెరగటం కూడా చోరీలు జరగడానికి మరో కారణంగా మారుతోంది.
- పెట్రోల్ తీయటానికి ఇబ్బందిగా ఉంటే వాహనాలను పగులగొట్టి మరీ పెట్రోల్‌ను చోరీ చేస్తున్నారు.
సమయానికి ఆసుపత్రికి వెళ్లలేకపోయాం...
రాత్రి వాహనాన్ని పార్కింగ్ చేసి నిద్రపోయాం. తెల్లవారుజామున ఇంట్లో వైద్య సమస్య వల్ల ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బైక్‌ను తీయటానికి వెళ్తే అది స్టార్ట్ కాలేదు. పరిశీలించగా పెట్రోల్ లేదు. బైక్‌లో రాత్రే పెట్రోల్ పోయించుకున్నా. కానీ స్టార్ట్ కాకపోవటంతో ఆసుపత్రికి సమయానికి వెళ్లలేక పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దొంగలు పెట్రోల్ చోరీ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితిని మానవత్వంతో ఆలోచించాలని కోరుతున్నా. –భీముడు, మూసాపేట
లాక్ పగులగొట్టి మరీ చోరీ చేశారు...
కొత్తగా మూసాపేటకు అద్దెకు వచ్చాం. వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. అందరిలాగే నా వాహనాన్ని కూడా రోడ్డుపై పార్కింగ్ చేశా. పెట్రోల్ తీయకుండా ఇంతకు ముందే పెట్రోల్ లాక్ వేశా. కానీ దొంగలు పగులగొట్టి పెట్రోల్ మొత్తాని చోరీ చేశారు. అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు నా బైక్‌లోని పెట్రోల్‌ను బాటిల్‌లో తీసి తిరిగి ఉదయాన్నే మళ్లీ వాహనంలో నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. –బీచ్‌పల్లి, మూసాపేట
Comments
Please login to add a commentAdd a comment