నేడు ‘స్వచ్ఛ హైదరాబాద్’పై సమీక్ష
- నగర ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంపై నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెత్త నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. తాగునీరు, విద్యు త్తు, రోడ్లపై చర్చిస్తారు. వచ్చే నెలలో నిర్వహించే హరితహారంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సీఎం అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో ఆదివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు దేవాదుల తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు ఆ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో రైతులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ పథకం ద్వారా కొండపాక మండలంలోని 11, సిద్దిపేట మండలంలోని 5 గ్రామాలకు సాగునీరందుతుంద ని సీఎం రైతులకు భరోసా ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎంకు ఎమ్మెల్యే సీహెచ్ రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఎం.శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.