
స్వచ్ఛమైన కల్లు అందిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైన కల్లు అందిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానంపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్షాసమావేశం నిర్వహించారు.
వచ్చే అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమలుచేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గుడుంబాను అరికట్టడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న మద్యం అక్రమ రవాణాపై దృష్టిసారించి, అరికట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల గట్లమీద ఐదు కోట్ల ఈత చెట్లను నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయమని, నగరంపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు.