‘సహన’ తలరాత మారుద్దాం
హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన తలరాతను మార్చేందుకు మేమున్నామంటూ వేలాది హృదయాలు ముందుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగువారు స్పందించడమే కాక.. చేతనైనంత సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన చిన్నారి సహనతోపాటు ఆమె కుటుంబ సభ్యులు పడుతున్న బాధలపై ‘తలరాతను మార్చుదాం’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనానికి విశేష స్పందన లభించింది. చిన్నారి సహన మోస్తున్న భారాన్ని తగ్గించేందుకు తమ వంతు బాధ్యతగా వేలాది చేతులు ఆపన్నహస్తం అందించాయి. ఆర్థికంగానేకాక మాట సాయం అందించి సహన కుటుంబానికి భరోసా కల్పించారు. హృదయాలను కదిలించే సహన కథనాన్ని మానవీయ కోణంలో ప్రచురించిన ‘సాక్షి’ యాజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
అండగా నేనున్నా..: కేటీఆర్
చిన్నారి సహన కథనాన్ని చదవి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు చలించిపోయారు. బాధిత కుటుంబానికి అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. బుధవారం ఫోన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి కార్యాలయ సిబ్బంది మాట్లాడారు. త్వరలోనే చిన్నారి సహనను స్వయంగా కలుస్తానని మంత్రి తెలిపారని, వైద్య చికిత్సల కోసం సీఎం సహాయనిధి నుంచి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టాలని తమను అదేశించారని మంత్రి పీఏ తెలిపారు. కేటీఆర్ కార్యాలయ సిబ్బంది తమతో మాట్లాడి, భరోసా కల్పించడంపై సహన నాయనమ్మ లక్ష్మమ్మ హర్షం వ్యక్తం చేసింది.
ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం..
సహనకు అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తిరుపతికి చెందిన రమాదేవి ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆస్పత్రి ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సహన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజమండ్రి ప్రాణజ్ఞాన వైద్యాలయం ప్రతినిధి శిరీష మాట్లాడుతూ ఎటువంటి రుసుము లేకుండా ఆకుపసరు వైద్యంతో సహన సమస్యను పరిష్కరిస్తామన్నారు. సహన వైద్య సేవల నిమిత్తం ప్రతి నెలా రూ. 10 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని గుంటూరు మదర్ థెరిసా ట్రస్ట్ ప్రతినిధి సాంబశివరావు తెలిపారు. సహన కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఆమె అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివిస్తామని హైదరాబాద్‌కు చెందిన సర్వనీడీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారం రోజుల కూలి డబ్బును తన వంతు సాయంగా అందిస్తానని శ్రీకాకుళం నరసన్నపేటకు చెందిన కూలి నాగరాజు చెప్పాడు.
హృదయాలను కదిలిచింది..
‘సాక్షి’ వెబ్‌పోర్టల్‌లో సహన కథనం చదవి పలువురు ఆర్థిక సాయం అందించారు. కాలిఫోర్నియాలో ఉంటున్న కమలాకర్, ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజేష్, చైనాలో ఉంటున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రమేష్ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించారు. మరోవైపు చిన్నారి సహన సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించనున్నట్లు మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి అభినయ్ తెలిపారు.