ఆ విమానాన్ని ఐదు ముక్కలు చేసి...
సికింద్రాబాద్: బేగంపేట విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానాన్ని తరలించే చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీ క్రేన్, ఓ చిన్న క్రేన్ సాయంతో ఏడు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రయత్నాలను నిలిపివేశారు. ఐదు భాగాలుగా విడగొట్టి ఫిరోజ్‌గూడ గోదాముకు తరలించాలని అధికారులు ప్రణాళిక రచించారు. కాగా, క్రేన్ నుంచి కిందపడిపోయి విరిగిపోయిన విమానం శకలాలను మూడురోజుల్లో తోలగిస్తామని ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కెప్టెన్ సోమన్ అతులా తెలిపారు. కూలిన విమానం మూడేళ్లుగా సర్వీసులో లేని విమానంగా చెప్పారు. తమ ఇనిస్టిట్యూట్‌లో డోర్ మెయింటనెన్స్, కాక్‌పిట్ మెయింటనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్‌బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. విమాన శకలాలను తరలించే వరకు ఓల్డ్ ఎయిర్‌పోర్టు రహదారిపై వాహనాలు, వ్యక్తుల రాకపోకల పట్ల ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు.
విమానం తరలింపునకు మూడు రోజులుగా కసరత్తు
బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియాకు చెందిన 320 ఎయిర్‌బస్ అనే భారీ విమానం మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఈ విమానాన్ని బోయిన్‌పల్లి ఒల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి బాలానగర్ వెళ్లేదారిలోని బేగంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీటీఐ)కు తీసుకువెళ్లేందుకు ఆదివారం చేసిన ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. విమానం గోడపై కూలిపోయింది.
ఎందుకోసం....
ఇక్కడి సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణలో ఉన్న ఎయిర్ ఇండియా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ఈ విమానాన్ని తీసుకెళ్లాలనుకున్నారు. విమానంలోని సీట్లను, కాక్‌పిట్‌లోని ఇంజిన్‌లను విడదీశారు. ఖాళీగా ఉన్న బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. ఇందుకు సీటీఐ అధికారులు మూడు రోజుల పాటు కసరత్తు చేశారు. విద్యుత్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్టు ప్రహరీగోడను తొలగించారు. ఓల్డ్‌ఎయిర్‌పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్, నెట్ వైర్లను యుద్దప్రాతిపదికన తొలగించారు. ముందు జాగ్రత్తగా విమాన తరలింపు జరుగుతున్న స్థలానికి కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు. ఈ జాగ్రత్తల ఫలితంగానే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.