టోని
సాక్షి, సిటీబ్యూరో: ఘట్‌కేసర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ–మెయిల్ ద్వారా ఎర వేసి... 45 వేల పౌండ్ల విలువైన కోకకోలా లాటరీ తగిలిందని నమ్మించి రూ.11.8 లక్షలు కాజేసిన నైజీరియన్‌ను రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన ఇతడి నుంచి 2100 డాలర్లు, 25 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఉడెలోర్ టోనీ న్యాండే 2010లో విజిట్ వీసా తీసుకుని భారత్‌కు వచ్చాడు. న్యూఢిల్లీలో మకాం ఏర్పాటు చేసుకున్న ఇతను మరికొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ఆధారంగా మోసాలకు తెరలేపాడు. ఇంటర్‌నెట్‌తో పాటు వివిధ మార్గాల్లో దేశ వ్యాప్తంగా అనేక మందికి చెందిన ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. బీబీసీ, కోకకోలా, సామ్‌సంగ్ వంటి ప్రముఖ కంపెనీల పేర్లను వినియోగించే టోనీ వారికి ఆ లాటరీలు తగిలాయంటూ ఎరవేసేవాడు. ఘట్‌కేసర్ మల్లికార్జున నగర్‌కు చెందిన పి.నవీన్‌కుమార్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోకకోలా లాటరీ పేరుతో ఈ–మెయిల్ వచ్చింది. రూ.3.67 కోట్ల (45 వేల పౌండ్లు) మొత్తం లాటరీ వచ్చినట్లు ఉన్న ఆ మెయిల్‌కు అతడు స్పందించడంతో అసలు కథ మొదలైంది. ఈ నగదు పొందడానికి పన్నుల రూపంలో కొంత మొత్తం చెల్లించాలంటూ చెప్పిన టోనీ అతడినినమ్మి ంచేందుకు సరికొత్త పంథా అనుసరించాడు. ‘డార్క్ నెట్’ నుంచి కొన్ని క్రెడిట్‌కార్డుల డేటాను సంగ్రహించాడు. వివిధ బ్యాంకుల వినియోగదారుల నుంచి చోరీ చేసిన క్రెడిట్‌కార్డుల డేటాను కొనుగోలు చేసి ఖాళీ మ్యాగ్నసిక్ స్టిప్ర్‌పై రైట్ చేయడంతో పాటు దానిపై బ్రిటిష్ బ్యాంకు పేరుతో పాటు బాధితుడి పేరునే ముద్రించాడు. ఈ కార్డ్‌తో పాటు దాని పిన్ నెంబర్‌ను సైతం బాధితుడికి పంపాడు. వీటిని వినియోగించి బాధితులు ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళి రూ.14 వేలు డ్రా చేసుకున్నాడు. దీంతో అతడికి లాటరీ డబ్బు తనకు వస్తుందని నమ్మకం కలగడంతో అప్పటి నుంచి వివిధ రకాలైన పన్నులు, ఇతర లావాదేవీల పేర్లు చెప్పి వివిధ దఫాల్లో రూ.11.8 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా వసూలు చేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి టోనీ నిందితుడిగా గుర్తించారు. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చింది.