- 5కె రన్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు వెళుతుండగా ప్రమాదం
- పీఈటీ ఫ్యాకల్టీతో పాటు 24 మందికి గాయాలు
- ఒక విద్యార్థినితో పాటు ఫ్యాకల్టీ పరిస్థితి విషమం
- అసెంబ్లీ సమీపంలోని రవీంద్రభారతి చౌరస్తా వద్ద ఘటన
హైదరాబాద్:
సమయం: ఆదివారం తెల్లవారుజామున 5.45 నిమిషాలు..
ప్రాంతం: అసెంబ్లీ సమీపంలోని రవీంద్రభారతి చౌరస్తా..
కళాశాల ఆధ్వర్యంలో సామాజిక ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న 5కె రన్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు బస్సులో బయల్దేరారు.
అయితే భారీ క్రేన్ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. మెట్రో పనుల్లో పాలుపంచుకుంటున్న ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన భారీ క్రేన్ ఒక్కసారిగా బస్సు కుడివైపున బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఒక ఫ్యాకల్టీ, 23 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఫ్యాకల్టీతో పాటు ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..
ఆదివారం ఉదయం 6 గంటలకు నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో 5కె రన్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు మొత్తం 12 బస్సుల్లో విద్యార్థులు బయల్దేరారు. ఏపీ 04 యు 2449 బస్సులో 45 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ముగ్గురు ఫ్యాకల్టీలు ఉన్నారు.
ఈ బస్సు నాంపల్లి వైపు నుంచి అసెంబ్లీ మీదుగా రవీంద్రభారతి చౌరస్తా వద్ద సచివాలయం వైపునకు వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా.. లక్డీకాపూల్ వైపు నుంచి ఆల్‌ఇండియా రేడియో వైపునకు వెళ్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన భారీ క్రేన్(ఎన్‌ఎల్ 02 కె 7733) బస్సు కుడివైపు డోర్‌ను బలంగా ఢీ కొట్టింది. క్రేన్ జాకీ బస్సు అద్దాలను చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు కుడివైపు ముందు సీట్లో కూర్చున్న కళాశాల పీఈటి ఫ్యాకల్టీ ఎస్.సాయిరెడ్డి(40) ఛాతీ, తల, ఎడమ కాలు, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆ వెనుక సీట్లోకూర్చున్న పగిల్ల మంజూషా(20)కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఫ్యాకల్టీ సాయిరెడ్డి, విద్యార్థిని మంజూషా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో విద్యార్థిని స్రవంతి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆమె ప్రస్తుతం మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరితో పాటు మరో 21 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థుల్లో 11 మందిని గ్లోబల్ ఆస్పత్రికి, మరో 11 మందిని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు.
కళాశాల బస్సు డ్రైవర్ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రేన్ డ్రైవర్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా సైఫాబాద్ పోలీసులు ప్రమాదం జరిగిన గంటలోపే క్రేన్, కళాశాల బస్సును ఘటనా స్థలం నుంచి తొలగించారు. ప్రధాన రహదారిపై పడిన రక్తపు మరకలను, గాజు పెంకులను శుభ్రం చేయించారు.