* కాలేజీల అఫిలియేషన్‌పై హైకోర్టును కోరిన ఏఐసీఈటీ, జేఎన్‌టీయూ
* నాలుగు వారాల్లో పూర్తిచేయాలని ధర్మాసనం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: 99 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి వాటి అప్రూవల్, అఫిలియేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలుకు గడువు కావాలన్న ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ అభ్యర్థనలకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. 4 వారాల్లో తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్‌టీయూ అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం.. హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో ప్రమాణాలపై తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ గతనెల 15న ఉత్తర్వులు జారీచేసింది. కాగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు 6 వారాల గడువు కావాలని ఏఐసీటీఈ తరఫు న్యాయవాది రమాకాంత్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఆరు వారాలు చాలా ఎక్కువ సమయని చెప్పడంతో, 4 వారాల గడువునివ్వాలని జేఎన్‌టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.
మరింత గడువు ఇవ్వండి
Published Fri, Aug 7 2015 1:58 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement