
మతోన్మాద పార్టీలకు బుద్ధి చెప్పాలి
కమ్యూనిస్టు నేతలు నారాయణ, రాఘవులు
లాలాపేట: మతోన్మాద, అధికార దాహంతో విర్రవీగుతున్న పార్టీలకు గ్రేటర్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ తార్నాక డివిజన్ అభ్యర్థి రాపోలు శోభారాణి తరఫున శుక్రవారం వారు లాలాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీలేనన్నారు. కార్యక్రమంలో సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి అన్నం వీరేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్: చాడ
చాంద్రాయణగుట్ట: టీఆర్‌ఎస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ గౌలిపురా డివిజన్ అభ్యర్థి వి.అన్నపూర్ణాదేవితో కలిసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్‌ఎస్ అడ్డదారులు తొక్కుతోందని, పాతబస్తీకి మెట్రోరైలు రాకుండా ఎంఐఎం అడ్డుకుంటోందని ఆరోపించారు. మతతత్వ పార్టీలకు చెక్ పెట్టాలంటే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ సీఎం కేసీఆర్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి.రాములు యాదవ్, జి.చంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.