
పాలేరుపై కాంగ్రెస్ దృష్టి
పోలింగ్ బూత్‌ల వారీగా ముఖ్య నేతల పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: పాలేరు శాసనసభ ఉప ఎన్నికపై టీపీసీసీ దృష్టి కేంద్రీకరించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్‌చార్జీలుగా నియమించి, బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, పి.సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్‌లకు ఒక్కొక్క మండలం బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు అవసరమైన వనరులను సమీకరిస్తూనే, నియోజకవర్గంలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
దివంగత శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి అభ్యర్థిత్వంపై సానుభూతి ఉందని, పార్టీకి నిర్మాణం, గిరిజనుల్లో వెంకటరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానం వంటివాటితో కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితి ఉందనే అంచనాలో టీపీసీసీ ఉంది. అయితే అధికార పార్టీకి ఉన్న అర్థ, అంగబలాలతో పాటు ఇతర పార్టీల నుంచి వలసలు టీపీసీసీలో ఆందోళన కలిగిస్తున్నా యి. అధికారపార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక పోకడలపై తెలంగాణ మేధావుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్నదనే అంచనాలో టీపీసీసీ ఉంది. దీనికి అనుగుణంగా గ్రామాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీ గా టీపీసీసీ నుంచి బాధ్యులు పనిచేస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా గురువారం నుంచి పాలేరులోనే ఉంటూ, ఇంటింటికీ తిరుగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.