paleru elections
-
మా పాలనకు ప్రజామోదం
- పాలేరు ఫలితంపై సీఎం కేసీఆర్ - పార్టీలన్నీ ముఠా కట్టినా ప్రజలు మమ్మల్నే ఆశీర్వదించారు - బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం సాక్షి, హైదరాబాద్: ‘‘పాలేరు ఉప ఎన్నిక ఫలితం ప్రజలు ఆషామాషీగా ఇచ్చిన తీర్పు కాదు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలనను పరిశీలించి, సమీక్షించి... మా విధానాలు కరెక్టంటూ వారు తెలిపిన ఆమోదం (ఎండార్స్మెంట్). ఇది మా పాలనకు ప్రజల ఆమోదం. మేమిదే పద్ధతిలో పనిచేయాలని, మీ వెంట మేమున్నామని.. ప్రజలు తేల్చి చెప్పారు. వారిచ్చిన ఈ అపురూపమైన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, ఆరోపణలు మాని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పాలేరులో టీఆర్ఎస్ రికార్డు మెజారిటీతో అపురూపమైన విజయం సాధించింది.నియోజకవర్గ చరిత్రలో 1972లో వచ్చిన 25,452 ఓట్ల మెజారిటీ యే ఇప్పటిదాకా అత్యధికం. మా పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పుడు ఏకంగా 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ సాధించారు. విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు. విజేతకు, విజయానికి పాటుపడ్డ పార్టీ శ్రేణులుకు అభినందనలు తెలిపారు. ఈ విజయం మరింత బాధ్యత పెంచిందన్న సీఎం, పొగరుకు పోవద్దని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ‘‘ప్రజలు టీఆర్ఎస్ను ఏకపక్షంగా గెలిపిస్తున్నరు. బ్రహ్మరథం పడుతున్నరు. ఈ ఫలితం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం. నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వి. ఉప ఎన్నికల్లో వారి అభ్యర్థుల పట్ల సానుభూతి ఉండాలి. అయినా దాన్ని కూడా పక్కనపెట్టారు. సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అసాధారణ తీర్పు ఇచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే 24 రెట్లు ఓట్లు పెరిగాయి. దీన్ని ప్రజలిచ్చిన ప్రోగ్రెస్ రికార్డుగా భావిస్తున్నాం. వారు కోరుకున్న విధంగా ముందుకు పోతాం’’ అని స్పష్టం చేశారు. విపక్షాలు ఇప్పటికైనా అవాకులు, చవాకులు పేలడం మానాలని సూచించారు. ఇలాంటి మాటల వల్ల వారి గౌరవంతో పాటు ప్రజల గౌరవం కూడా పోతోందన్నారు. తాము పూర్తి అవినీతిరహితంగా, పైరవీకారులకు అవకాశం లేకుండా పని చేస్తున్నామన్నారు. ప్రజల తీర్పునూ అవమానిస్తరా? విపక్షాల తీరుపై సీఎం ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మా పార్టీ అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయిన ఐదో రోజు నుంచే ఎవరికి వారుగా, సమూహంగా అర్ధసత్యాలతో ఆరోపణలు చేస్తున్నరు. తెలంగాణలో అవినీతిరహిత పాలన సాగుతోందని ప్రధాని సహా వివిధ సంస్థలు, అధికారులు కితాబిచ్చారు. విపక్షాలు మాత్రం ఉన్మాద దాడికి దిగుతున్నయి. అవినీతి జరుగుతోందంటరు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటరు. వ్యక్తిగత దాడికి దిగుతున్నరు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నరు’’ అంటూ విమర్శించారు. విపక్షాల ఆరోపణల్లో పసలేద న్నారు. చివరకు ప్రజల తీర్పునూ అవమానిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పాలేరు ఫలితంతోనైనా వారికి కనువిప్పు కలగాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసిందని, కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులపైనా ఆరోపణలు చేసిందని, చివరకు ఓటింగ్ యంత్రాలను కూడా వివాదాస్పదంచేసిందని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ అధికారిగా ఎన్నికల సంఘమే ప్రకటించిన లోకేశ్‌కుమార్ వంటి ఐఎఎస్ అధికారినీ శంకించారని, ఈ తీర్పు తర్వాత వారేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సిద్ధాంతాలు గాలికొదిలారు... అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు సిద్ధాంతాలను గాలికొదిలి మహాకూటమి కట్టారని, అన్ని పార్టీలూ కలసి పోటీ చేసినా టీఆర్ఎస్ ఏకంగా 20 వార్డులు గెలుచుకుందని సీఎం అన్నారు. పాలేరులోనూ ఇలాగే ముఠా కట్టారని ఆరోపించారు. అయినా కాంగ్రెస్‌కు అక్కడ గతంలో వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారని, గుడ్డిగా కాకుండా ఆలోచించి ఓటేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఇంకా 1947 నాటి పాలిటిక్స్ చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటమేమిటి, హాస్యాస్పదం కాకపోతే! ప్రజా సమస్యలపై పోరాడండి. పంథా మార్చుకోండి’’ అని సూచించారు. రెండేళ్ల కాలంలో ఏడాది పాటు అధికారులే లేరు. విడిపోయిన ఏపీ సమస్యలు సృష్టిస్తూనే ఉంది. అనేక సమస్యలున్నాయి. ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదు. కొందరు వారి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నరు. చంద్రబాబు ఢిలీల్లో మాట్లాడుతూ, రూ.60వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను వదులుకున్నామన్నడు. అంత ఆదాయమెక్కడిది? ఈసారి రాష్ట్ర బడ్జెట్లో కమర్షియల్ ట్యాక్సు ద్వారా రాష్ట్రమంతటా కలిపి విధించుకున్న పన్నుల వసూలు లక్ష్యమే రూ.42 వేల కోట్లు! ఇలాంటి అబద్ధాలు, అసత్యాల మీద రాజకీయాలు నడిచే కాలం పోయిం ది. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉంటే వారి మద్దతుంటది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వరుసగా గెలిచారు. మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో సీఎంలు రెండోసారి గెలిచారు. మంచి పని చేస్తే ప్రజలు హత్తుకుంటున్నరు’ అని సీఎం పేర్కొన్నారు. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం రాష్ట్రంలో ఏమీ జరుగుతలేదని విపక్ష నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. ‘‘సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఉన్నం. మంత్రుల పేషీల దగ్గర ఎదురు చూపుల్లేకుండా, పైరవీలు, లంచాలు లేకుండా నిర్ణీత వ్యవధిలోనే 1,700 పరిశ్రమలకు టిఎస్ఐపాస్ ద్వారా అనుమతులిచ్చినం. అమెజాన్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాల రెండో అతిపెద్ద క్యాంపస్‌లు మన రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి. రాష్ట్రానికి ఫేస్బుక్ వచ్చింది. యాపిల్ వచ్చింది. ఈ ఏడాది రూ.68 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులతో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. మంచి పనులను అభినందించండి. నిర్మాణాత్మక సూచనలు చేయండి. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నం. మీ వ్యూహాలు మార్చుకోండి’’ అని సూచించారు. విపక్షాలు నిర్మాణాత్మక పంథాలోకి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. లక్ష్మణ్ది కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందం కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ‘‘కేంద్రం కరువు నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపిస్తున్నరు. మరి తెలిసి మాట్లాడుతున్నరో, తెలియకనో అర్థం కావడం లేదు. కేంద్రం ఇచ్చింది కేవలం రూ.74 కోట్లే. రాష్ట్రం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇన్పుట్ సబ్సిడీ రూ.1,300 కోట్లు కావాలని కోరాం. కరువు సాయం పెంచాలని ప్రధానిని కోరాం. కరువు నుంచి శాశ్వతంగా బయట పడటానికి చేపట్టిన మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ పథకాలకు సహకరించాలని, ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. లక్ష్మణ్‌కు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సోయి ఉంటే రాష్ట్రానికి ఒక్కటన్నా కేంద్ర పథకం సాధించుకురావాలి. ఏమైతరో, ఏం పోతరో కానీ, 2019లో తామే ప్రత్యామ్నాయమంటున్నరు. మాపై విషం చిమ్ముతున్నరు’’ అంటూ దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలపై పరువు నష్టం దావా ‘మా ప్రభుత్వంపై ఇన్నాళ్లూ లేనిపోని ఆరోపణలు చేశారు. అవాకులు చవాకులు పేలారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు, నిందలు మానుకోవాలి. ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం కానీ, ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటం. అనవసర విమర్శలు, వెకిలి ఆరోపణలు చేస్తే కేసులు పెడతం. పరువు నష్టం దావా వేస్తం. అవినీతి ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ప్రయత్నిం చి పట్టుబడింది ఎవరో ప్రజలకు తెలుసు. అరకిరా పనులు చేసి అవాకులు, చవాకులు పేలితే బా గుండదు’ అంటూ విపక్షాలను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. -
పాలేరు ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలం
♦ ఉప ఎన్నికపై సీపీఎం అంచనా.. ♦ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని సీపీఎం అంచనా వేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలనే వ్యూహంతో 11 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అభిప్రాయపడింది. మంగళవారం హైదరాబాద్ ఎంబీ భవన్లో జరిగిన పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సమావేశం ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. కుల సంఘాలు, వర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి బెదిరించడం, లొంగదీసుకోవడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, టీఆర్ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణుల గురించి ప్రజలకు వివరించగలిగామని పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరిగిన ఎన్నికలో ఆయన కుటుంబంపట్ల ప్రజల్లో కొంతమేర సానుభూతి కనిపించినా, దానిని ఓట్ల రూపంలో మలచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల 20 నుంచి 30 తేదీల మధ్య సీపీఎం శిక్షణ తరగతులను హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మంలలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ప్రాజెక్టులు, నిర్వాసితుల కష్టాలు, కరువు, ఇతర ప్రజాసమస్యలపై వచ్చే నెలలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. -
పాలేరుపై కాంగ్రెస్ దృష్టి
పోలింగ్ బూత్‌ల వారీగా ముఖ్య నేతల పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: పాలేరు శాసనసభ ఉప ఎన్నికపై టీపీసీసీ దృష్టి కేంద్రీకరించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్‌చార్జీలుగా నియమించి, బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, పి.సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్‌లకు ఒక్కొక్క మండలం బాధ్యతలను అప్పగించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికలకు అవసరమైన వనరులను సమీకరిస్తూనే, నియోజకవర్గంలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. దివంగత శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి అభ్యర్థిత్వంపై సానుభూతి ఉందని, పార్టీకి నిర్మాణం, గిరిజనుల్లో వెంకటరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానం వంటివాటితో కాంగ్రెస్‌కు సానుకూల పరిస్థితి ఉందనే అంచనాలో టీపీసీసీ ఉంది. అయితే అధికార పార్టీకి ఉన్న అర్థ, అంగబలాలతో పాటు ఇతర పార్టీల నుంచి వలసలు టీపీసీసీలో ఆందోళన కలిగిస్తున్నా యి. అధికారపార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక పోకడలపై తెలంగాణ మేధావుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్నదనే అంచనాలో టీపీసీసీ ఉంది. దీనికి అనుగుణంగా గ్రామాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీ గా టీపీసీసీ నుంచి బాధ్యులు పనిచేస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా గురువారం నుంచి పాలేరులోనే ఉంటూ, ఇంటింటికీ తిరుగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బంగారు తెలంగాణకు పునరంకితం
ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తృప్తి ముందు ఈ సీఎం పదవి ఏపాటిది? తెలంగాణ ఆగం కావొద్దనే.. నేను నెత్తినెత్తుకున్నా ప్రజలారా... మీ దీవెన కొనసాగించండి నాకు నేనే ఒక ఆంక్ష విధించుకున్నా ప్రతి ఇంటికి నల్లా నీరు తెస్తాన ని, లేదంటే ఓట్లడగమని చెప్పా ఎంపీలు, ఎమ్మెల్యేల భవిష్యత్తును పణంగా పెట్టా 2017 నాటికి 95 % గ్రామాలకు నీరు 2019కల్లా రైతులకు 24 గంటల కరెంటు పాలేరులో తుమ్మలను గెలిపించండి.. ఖమ్మం బంగారు గుమ్మం అవుతుంది ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాకు ఇప్పుడు 63 ఏళ్ల వయస్సు. ఇంకా ఏం కావాలి? తెలంగాణను తెచ్చిన తృప్తి ముందు ఈ సీఎం పదవి ఏపాటిది? తెచ్చిన తెలంగాణ ఆగం కావొద్దు.. వేరే వారికి అప్పగిస్తే ఆగం అవుతుందని నెత్తిన ఎత్తుకున్న. అందరి సమస్యలు తీర్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇల్లు కడితే కనీసం రెండు తరాల అవసరాలు తీరాలి. పేదల ఆత్మగౌరవాన్ని పెంచడానికే డ బుల్ బెడ్ రూం పథకం. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నాం. మీ మద్దతు, దీవెన కొనసాగించండి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కష్టపడి రా ష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని, ప్రజల ఎజెండాయే టీఆర్ఎస్ ఎజెండా అని ఉద్ఘాటించారు. ‘ప్రజలే మా బాసులు.. రాష్ట్రం కల సాకారమైంది. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితం అవుతున్నాం’ అని పేర్కొన్నారు. బుధవా రం రాత్రి ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నన్ను చూస్తే తప్పించుకొని పోయేవారు.. తెలంగాణ సమాజానికి ఒకటే మనవి. స్వప్నించే సాహసం ఉండాలి. డేర్ టు డ్రీమ్ అంటామే అది! తెలంగాణ కుమిలి, కునారిల్లుతున్న, అంతులేని దోపిడీ జరుగుతున్న సమయంలో పదవుల్లో ఉండి కుమిలిపోయా. పోరాడాలని చాలా మందితో చర్చించా. అయినా నిస్సహాయ స్థితి. కొందరైతే పదవులు పోవడం తప్ప రాష్ట్రం రాదు అనడం వినేవాణ్ని. 1996లోనే ఆదిలాబాద్‌కు వెళ్లినప్పుడు ఎస్సారెస్పీ కట్ట మీదనే కొందరు మిత్రులతో చెప్పా. ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదని. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి శివాలయంలా ఉంది. ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయంలా ఉంటాయన్నా. ఎన్నడో ఒకనాడు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్న. తెలంగాణ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తానని కూడా చెప్పా. దేనికైనా సందర్భం రావాలి. పాపం పండాలి. శిశుపాలుడికి కూడా వంద తప్పుల దాకా అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ సమాజంపై విద్యుత్ చార్జీల భారం మోపారు. బషీర్‌బాగ్ కాల్పులు కలచివేశాయి. అందుకే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఉద్యమం ప్రకటించిన. చాలా మంది నన్ను చూస్తే తప్పించుకు పోయేవారు. ఎక్కడ నేను వారిని తెలంగాణ అంటూ విసిగిస్తానో అని. నాయిని నర్సింహారెడ్డి, మధుసూదనాచారి మరికొందరు నాయకులం కలిసి గులాబీ జెండా ఎగరేశాం. గతంలో ఉద్యమంలో పచ్చి మోసం జరిగింది. పదవులకు అమ్ముడు పోయారు. ప్రజలు నమ్మలేదు. వంద శాతం ఇంటికి ఒకరిని ఇవ్వండి తెలంగాణ సాధిస్తా అన్నా. ఉద్యమ బాట వీడనని ప్రజలకు మాటిచ్చా. నేను పెడదారుల్లో వెళితే రాళ్లతో కొట్టి చంపమన్న. పిడికెడు మందితో మొదలైన ప్రస్థానం అనేక కష్టనష్టాలు, అవమానాలు ఓర్చుకుని ముందుకు వెళ్లింది. ఈ బక్కోడు ఏమో చేస్తుండు. బొండిగ పిసికి చంపుతరు అన్నరు. 14 ఏళ్లలో కలను సాకారం చేసుకున్నం. లక్ష్యాన్ని ముద్దాడాం. అందరి రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టా ఏ రాజకీయ నాయకుడైనా మాయ మాటలు చెబుతారు కానీ.. ఆంక్షలు విధించుకోరు. టీఆర్ఎస్కు ఉద్యమ సోయి ఉంది. ఒక ఆంక్ష నాకు నేనే విధించుకున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీల భవిష్యత్‌ను పణంగా పెట్టా. ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇస్తా.. లేదంటే ఎన్నికల్లో ఓట్లు అడగం అన్నా. మిషన్ భ గీరథ బృహత్తర పథకం. ఈ ఏడాది చివరినాటికి 6,200 గ్రామాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి 95 శాతం గ్రామాలకు నీరు అందుతుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. అందుకే బడ్జెట్లో రూ.25,000 కోట్లు కేటాయించాం. రూ. 200 పెన్షన్ ఇచ్చి ఓట్లు గుద్దించుకున్నరు. అట్లా ఓట్లు గుద్ది గుద్ది ఇక్కడి దాకా వచ్చింది. రూ. వెయ్యి పెన్షన్ మేం ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లెందుకు.. ఒక్క రూం ఉన్నవి చాలుగా అన్నారు కొందరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక గది ఇంట్లో ఉంటారా? కాపురం చేస్తారా? అందుకే వాస్తవాలు చూసి నిర్ణయాలు తీసుకుంటున్నా. కరెంటు సమస్య తీరింది. ఇక తెలంగాణలో కరెంటు పోనే పోదు. 2019 నాటికి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాం. తుమ్మలకు భారీ మెజారిటీ ఇవ్వండి మూలాల్లోకి పోయి పనిచేస్తే తప్ప సమస్యలు తీరవు. ఎప్పుడైనా మంచి, న్యాయమే జయిస్తది. అందుకే రాష్ట్రంలో ఏ మూలన ఎన్నిక జరిగినా ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేస్తున్నరు. ప్రజల పరిశీలన నిశితంగా ఉంటది. తుమ్మల నాకు ఆత్మీయ మిత్రు డు. 35 ఏళ్లుగా అనుబంధం. ఒకేసారి రాజకీయాలు ఆరంభించాం. తుమ్మల నాయకత్వంలో ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. పాలేరు ప్రజలకు ఒక్కటే మనవి. తుమ్మలకు ఎమ్మెల్సీగా ఇంకా అయిదేళ్ల పదవీ కాలం ఉంది. ఎన్నికలయ్యాక కూడా రెండేళ్లు గడువు ఉంటుంది. క్రియాశీలకమైన నేత. ప్రజల మధ్య ఉండాలి. ఆయనను పాలేరుకు పంపించింది కేసీఆర్. కలిసొచ్చే అదృష్టాని కి నడిచొచ్చే కొడుకు పుడతాడట. సీఎంకు కుడి భుజం, సీఎంకు సన్నిహితుడు. మంచి మెజారిటీతో గెలిపించండి. అయిదేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపెడతం. మీపై నమ్మకం ఉంది. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. బయ్యారం ఉక్కు .. తెలంగాణ హక్కు. కొన్ని ఇబ్బందులు ఉన్నా స్టీల్ ప్రాజెక్టు పెడతం. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు విజయవాడకు వె ళ్లింది. అందుకే భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాం. ఖమ్మం బంగారు గుమ్మం అయితది. బంగారు తెలంగాణకు పునరంకితం చేసుకుంటున్నాం.