
పాలేరు ఫలితం టీఆర్ఎస్ కు అనుకూలం
♦ ఉప ఎన్నికపై సీపీఎం అంచనా..
♦ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉపఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని సీపీఎం అంచనా వేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలనే వ్యూహంతో 11 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అభిప్రాయపడింది. మంగళవారం హైదరాబాద్ ఎంబీ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సమావేశం ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. కుల సంఘాలు, వర్గాల వారీగా సమావేశాలను నిర్వహించి బెదిరించడం, లొంగదీసుకోవడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణుల గురించి ప్రజలకు వివరించగలిగామని పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరిగిన ఎన్నికలో ఆయన కుటుంబంపట్ల ప్రజల్లో కొంతమేర సానుభూతి కనిపించినా, దానిని ఓట్ల రూపంలో మలచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల 20 నుంచి 30 తేదీల మధ్య సీపీఎం శిక్షణ తరగతులను హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మంలలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ప్రాజెక్టులు, నిర్వాసితుల కష్టాలు, కరువు, ఇతర ప్రజాసమస్యలపై వచ్చే నెలలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది.