సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌తో కలసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. అలాగని టీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో జతకట్టేందుకు కూడా తాము సిద్ధంగా లేమని ఆయన చెప్పారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) పేరుతోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో తమ్మినేని ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పాటైతే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ‘కూలీల బతుకులు మారలేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. అలాంటప్పు డు తెలంగాణ వచ్చి ఏం లాభం?’అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల బతుకులు మారకపోగా కనీస ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ ఎత్తివేసి ప్రజల గొంతు నొక్కుతున్నారని.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం, కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా.. గిరిజనుల పోడు భూములను సైతం లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తాము నిర్ణయించుకున్నట్టు తమ్మినేని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి కాంగ్రెస్‌ను కూర్చోబెట్టాలని తాము కోరుకోవడం లేదన్నారు. ‘ఒక దెయ్యాన్ని దింపి ఇంకో దెయ్యాన్ని నెత్తిన కూర్చోబెట్టుకోవాలని మేం భావించడం లేదు. అన్ని దెయ్యాలను పాతిపెట్టాలని కోరుకుంటున్నాం. బీఎల్‌ఎఫ్ పక్షాన ఈసారి అధికారం మాకివ్వాలని ప్రజలను అడగాలని నిర్ణయించుకున్నాం. ఇదే విధానంతో ముందుకెళ్తాం’అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రజారాజ్యం కచ్చితంగా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏదో సాధించాలని బీజేపీ, కొన్ని మతోన్మాద శక్తులు భావిస్తున్నాయని.. ఎర్రజెండా ఉన్నంతవరకు ఈ రాష్ట్రంలో కాషాయాన్ని ఎదగనిచ్చేది లేదన్నారు. భవిష్యత్‌లో జరిగే ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని మద్దతివ్వాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment