ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి?
సిరిసిల్ల: ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి ? ప్రజలకా ? మాఫియా గుండాలకా ? ప్రభుత్వం తేల్చి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం ఆయన సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక రీచ్ లలో పోలీసులకు రోజుకెంత మామూళ్లు అందుతున్నాయని నిలదీశారు. పోలీసుల అండతోనే ఇసుక మాఫియా భారీగా నడుస్తోందని ఆరోపించారు. నేరెళ్ల ఘటన ఈ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు. మితిమీరిన పోలీస్ ఆగడాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోలీస్ రాజ్యంగా మారిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవడానికే ఏ వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం పోలీస్ శాఖ ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇసుక లారీలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదనలో ప్రశ్నించిన, లారీలను దగ్ధం చేసిన గ్రామస్తులను పోలీసులు పాశవికంగా కొట్టిన విషయం విదితమే. ఈ విషయంలో కొంత మంది దళితులను పోలీసులు థర్డ్ డిగ్రీతో హింసించిన సంగతి తెలిసిందే.