కామ్రేడ్‌... ‘కారెందుకెక్కారో’? | CPIM New Strategy On Nagarjuna Sagar Supports To TRS | Sakshi
Sakshi News home page

కామ్రేడ్‌... ‘కారెందుకెక్కారో’?

Published Fri, Apr 23 2021 3:48 AM | Last Updated on Fri, Apr 23 2021 3:48 AM

CPIM New Strategy On Nagarjuna Sagar Supports To TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ సిద్ధాంతాలకి రాష్ట్ర కామ్రేడ్లు కొత్త భాష్యం చెబుతున్నారా? ప్రజల తరఫున అధికార పక్షంపై పోరాటమే కాదని, రాజకీయ అవసరాన్ని బట్టి అధికార పార్టీకి కూడా అండగా నిలవాలని భావిస్తున్నారా? నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటన వెనుక సీపీఎం వ్యూహం అదేనా? ఎన్నికలనే తాత్కాలిక ఎత్తుగడలు కూడా పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడాలని రాష్ట్రంలోని మార్క్సిస్టులు నిర్ణయిం చుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి సీపీఎం శ్రేణులు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం వెనుక వ్యూహం కూడా అదేనని, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలంటే తమకు ఉన్న ఎంతో కొంత బలాన్ని టీఆర్‌ఎస్‌కు అందించడమే తక్షణ రాజకీయ కర్తవ్యమని సీపీఎం నేతలు నిర్ణయించు కున్నారని తెలుస్తోంది. అవసరమైతే 2023లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అవలంబించాలన్న అంచనాకు కూడా ఆ పార్టీ నేతలు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

శత్రువుకి శత్రువు... మిత్రుడే..
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరింత పుంజు కుంటుందనే అంచనాకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం వచ్చింది. అదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తి రేసులో ఆ పార్టీని బీజేపీ వెనక్కు నెట్టి వేస్తుందని అభిప్రాయపడుతోంది. ఈ పరిస్థి తుల్లో తాము ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ పక్షాన నిలబడి ఉపయోగం లేదని కామ్రేడ్లు ఓ అంచనాకు వచ్చారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతో చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్నికల అంశాన్ని భిన్న కోణంలో ఆలోచించాల్సిందే. ఎన్నికలు జరిగే సమయంలో కేవలం పార్టీ సిద్ధాంతాలే కాదు.. అనేక అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో గుడ్డిగా వెళ్లడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికి నష్టపోయింది చాలు. ఇంకా మేం నష్టపోకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించడం ఆ పార్టీ మూడ్‌ను తేటతెల్లం చేస్తోంది.

ప్రజల్లో చర్చ జరిగితే మంచిదే!
కాగా, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయాలా... ఎవరికైనా మద్దతివ్వాలా అనే అంశంపై సీపీఎం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై పార్టీ జిల్లా కమిటీ నుంచి లెక్కలు తెప్పించుకున్న రాష్ట్ర నాయకత్వం తాము పోటీ చేయకపోవడమే మేలనే అంచనాకు వచ్చింది. ఇక, ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద చర్చే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయమై జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నేతలు రెండుగా చీలిపోయినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రతిపాదనను కొందరు నేతలు వ్యతిరేకించారని తెలిసింది. కాంగ్రెస్‌కు మద్దతివ్వడమే రాజకీయంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వారు వెలిబుచ్చినట్టు వారు సమాచారం. కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అభిప్రాయాలను అంగీకరించలేదు. ‘ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తే పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. అయినా సరే... అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయమున్నందున దీనిపై ప్రజల్లో చర్చ జరగాల్సిందే. బీజేపీ దూసుకొచ్చిన తర్వాత కూడా మనం శషభిషలకు పోతే నష్టపోతాం. దుబ్బాకలో కూడా తప్పుడు అంచనాతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించి టీఆర్‌ఎస్‌ ఓటమికి పరోక్షంగా దోహదపడ్డాం. అందుకే సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడమే కరెక్ట్‌. ఈ ఎన్నికలే కాదు 2023 ఎన్నికలకు కూడా నిర్ణయం ఇదే విధంగా ఉండొచ్చు. పార్టీ శ్రేణులకు, అటు ప్రజలకు సర్దిచెప్పాల్సిందే’ అని రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్క్సిస్టు వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌తోనే కలిసి వెళ్లాలనే మార్క్సిస్టు పార్టీ నేతల వ్యూహం చూస్తే ఎప్పటిలాగే 2023లో కూడా వామపక్షాల ఐక్యత ఎండమావేనని, సీపీఐ, సీపీఎంలు మళ్లీ పొత్తు పెట్టుకున్నా, టీఆర్‌ఎస్‌ మాటునే పెట్టుకోవాల్సి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement