నియోజకవర్గం నుంచి 30 మంది కార్యకర్తలకు త్వరలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో అడుగు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే బాధ్యతలను ప్రశాంత్ కిశోర్‌కు ఏఐసీసీ అప్పగించినట్టుగా తెలిసింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన ప్రశాంత్ కిశోర్ తన అవసరాలను టీపీసీసీ ముందుంచారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా పనిచేయడానికి ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 30 మంది మెరికల్లాంటి, చురుకైన కార్యకర్తల జాబితా కావాలని కోరారు. దీనికి అనుగుణంగానే 30 మంది జాబితాను ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఏఐసీసీ నుంచి సూచనలు అందాయి.
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతమున్న నియోజకవర్గాల ప్రకారం సుమారు 3,600 మంది కార్యకర్తలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వచ్చే నెలలో సమావేశం అవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులు, వాటికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రశాంత్ కిశోర్ స్థూలంగా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది.
దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలంటే ఏమేం చేయాలో ప్రశాంత్ కిశోర్ సూచనల ప్రకారం ఎంపికైన కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుంది. కార్యకర్తలకు వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం, వీటి ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవడం, పార్టీని పటిష్ట పరుచుకోవడానికి తగిన సూచనలను, సలహాలను ప్రశాంత్ కిశోర్ ఇవ్వనున్నట్టుగా సమాచారం.