తేడా ఎక్కడ కొట్టింది! | 'counter check' on survey | Sakshi
Sakshi News home page

తేడా ఎక్కడ కొట్టింది!

Published Tue, Apr 11 2017 3:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

తేడా ఎక్కడ కొట్టింది! - Sakshi

తేడా ఎక్కడ కొట్టింది!

► టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సొంత సర్వేలు!
► పార్టీ సర్వేపై ‘కౌంటర్‌ చెక్‌ ’
► తమ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం
► పనితీరును బేరీజు వేసుకుంటున్న తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు


సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు పలువురు సర్వే పనుల్లో మునిగిపో యారు. తమ పనితీరుపై స్వయంగా అంచనాకు వచ్చేందుకు వీరు సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు. పనితీరును మెరుగుపర చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి నుంచి పదేపదే చెబుతున్నా కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారని తెలుస్తోంది. ఈ విషయం కేసీఆర్‌ చేయించిన అంతర్గత సర్వేలలో తేటతెల్లం అయ్యిందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో  తాము సొంతంగా సర్వేలు చేయించుకుని.. వచ్చిన ఫలితాలతో సీఎం సర్వే ఫలితాలను బేరీజు వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

కేసీఆర్‌ ఏకంగా ఏడాది సమయంలోనే రెండు సార్లు సర్వే చేయించారు. ఈ ఫలితాలను గత నెల 9వ తేదీన తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వివరిం చారు. ఈ సందర్భంలోనే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటిం చినా, సర్వేలో మార్కులు, ర్యాంకులు తక్కు వగా వచ్చిన ఎమ్మెల్యేలు నిద్రపోలేక పోతు న్నారని చెబుతున్నారు. తాము కష్టపడి పనిచే స్తున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఇలా ఎందుకు జరిగిందన్న అంశంపై ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందని పేర్కొంటున్నారు.

పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఇలా తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు సొంతంగా సర్వేలు చేయించుకునే పనిలో పడ్డారు. సీఎం సిట్టింగులకే మళ్లీ టికెట్లు అని చెబుతున్నా, నియోజకవర్గంలో తమ పరిస్థితి బాగా లేకుంటే తీరా ఎన్నికల ముందు టికెట్‌కు ఇబ్బంది పడాల్సి వస్తుందని జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ప్రజల్లో సరైన ఆదరణ లేకున్నా, పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సర్వే ఫలితాల్లో తేలడంతో ఎమ్మెల్యేలు ఆత్మరక్షణలో పడిపోతున్నారు.

ఎమ్మెల్యేల అంతర్మథనం
‘అసలు ఎక్కడ బలహీనంగా ఉన్నాం? ప్రజలకు చేరువ కావటంలో ఎక్కడ తేడా వచ్చింది?  సీఎం కేసీఆర్‌ చేస్తున్న సర్వేల్లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటేగానీ మెరుగుపడలేం. మొదటి సర్వేలో మంచి మార్కులు, ర్యాంకు వచ్చింది. రెండో సారి సర్వేకు అంతా కిందా మీదా అయ్యింది.. అయినా నిజాలు తెలుసుకోవాలి కదా..’ అని ఒక ఎమ్మెల్యే సర్వేలపై వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ గాలిని తట్టుకుని ఆయా పార్టీల నుంచి 2014 ఎన్నికల్లో  గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీ గడపతొక్కారు. కానీ, తీరా సర్వేలో మాత్రం వారి పరిస్థితి ఏమాత్రం బావోలేదని, అదే పార్టీ పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉందని ఫలితం తేలడంతో ఈ ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. సీఎం కేసీఆర్‌ సర్వేలో తీసుకున్న అంశాలపైనే సర్వే చేయించుకోవడం ద్వారా తమ గ్రాఫ్‌ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవచ్చని వీరు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ మళ్ళీ సర్వే చేసే నాటికి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ర్యాంకు తెచ్చుకునేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement