జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 19వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. దోషులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్‌ఐఏ ఇంతకుముందు అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన ఐదుగురినీ ఎన్ఐఏ వర్గాలు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచాయి.
నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.