
'సోషల్ మీడియా ఫోటోలతో జాగ్రత్త'
బహదూర్‌పురా : సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి చిత్రాలనైనా ఎక్కువగా ఇతరులకు పంపిస్తూ ప్రచారం చేయవద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఫోటోల నేపథ్యంలో కమిషనర్ వివిధ మత పెద్దలు, విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులతో శనివారం సాలార్‌జంగ్ మ్యూజియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోషల్ మీడియా వాట్సాఫ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వచ్చే చిత్రాలు మత విశ్వాసాలకు భంగం కలిగిస్తూ మనోభావాలను దెబ్బతిసేలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గత కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో వచ్చిన ఓ చిత్రం పాతబస్తీలో కలకలం రేపిందన్నారు. ఇలాంటి వాటిపై మత పెద్దలు, విద్యావంతులు జాగ్రత్తతో ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వాటిపై కూడా కేంద్ర సహకారం తీసుకుని, ఆ దేశాలకు ఫిర్యాదు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నిటిపై పాఠశాల, కళాశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు మహేందర రెడ్డి చెప్పారు.