
స్పందిస్తారా.. ఉద్యమించమంటారా? :సీపీఐ నేత నారాయణ సవాల్
♦ కరువుపై సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత నారాయణ సవాల్
♦ కరువు డిమాండ్లపై ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
♦ అంబలి కేంద్రాలను మూయిస్తున్న సీఎం... ఆకలి చావులను ఆపగలరా?
♦ ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, బాబు నోట ప్రాజెక్టుల మాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు నుంచి ప్రజలను కాపాడతారో లేక సమరశీల ఉద్యమాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ సవాల్ విసిరారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టకుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసేందుకు తాము సిద్ధమని... చేతనైతే దీన్ని ఎదుర్కోవాలన్నారు. రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తోపాటు అధిక కరువు సాయం కోసం ఢిల్లీకి సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఉడతాభక్తిగా అంబలి కేంద్రాలను ప్రారంభిస్తే సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చి వాటిని నియంత్రించాలంటూ పోలీసులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కరువు ఉంటే అవమానమని భావించి కొన్ని చోట్ల తమ అంబలి కేంద్రాలను మూసేయించిన కేసీఆర్...ఆకలి కేకలు, రైతు ఆత్మహత్యలు, వలసలను ఆపగలరా? అని నిలదీశారు. కరువు నివారణ చర్యల విషయంలో కేసీఆర్‌ది పైశాచిక ఆనందమని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సీఎం నిధి...
బడ్జెట్‌లో సొంత నిధికింద ఖర్చు చేసేందుకు సీఎం రూ. 4,600 కోట్లు కేటాయించుకొని...దాన్ని ఇతర పార్టీలకు చెందిన 46 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారని నారాయణ ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇటీవల ఒక పార్టీకి చెందిన వారిని చేర్చుకుని ఫలానా రాజకీయ పార్టీని మాయం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షాలు లేకుండా ఖాళీ చేయాలని భావిస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారి సీఎం కేసీఆర్ అంతుచూస్తారని నారాయణ హెచ్చరించారు. నిరంకుశ నిజాం నవాబునే తెలంగాణ ప్రజలు మట్టికరిపించారని, నిజాం ముందు కేసీఆర్ ఎంత అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరం లేదంటున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ తీర్మానం చేసినప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
దృష్టి మళ్లించేందుకే ప్రాజెక్టులు తెరపైకి...
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల అంశాన్ని ముందుకు తెచ్చారని నారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు, కేసీఆర్‌లు ఒకే కోవకు చెందినవారని...పాలేరులో గెలిచేందుకు కేసీఆర్ గోదావరి ప్రాజెక్టుల పేరుతో ప్రకటనలు చేస్తుంటే ప్రత్యేక హోదా విషయంలో విఫలమైన చంద్రబాబు ప్రజలు తిరగబడతారనే భయంతో వారి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇద్దరూ బర్రె పేడను బద్దలు చేసే వీరులేనంటూ ఎద్దేవాచేశారు. నీటి పంపకాలపై రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా చర్చిం చుకొని పరిష్కరించుకునే అవకాశమున్నా అలా చేయడం లేదని విమర్శించారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఈర్ల నర్సింహ, నేతలు బాల మల్లేశ్, డా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.