మోదీని వందసార్లు షూట్ చేయాలి : సీపీఐ నేత నారాయణ
రెండేళ్లలో దళితులపై లెక్కలేనన్ని దాడులు: సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత రెండేళ్ల కాలంలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని.. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని వందసార్లు షూట్ చేసినా పాపం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శివర ్గసభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మోదీకి జ్ఞానోదయమై, హైదరాబాద్‌కు వచ్చాక దళితులపై దాడులు చేయడానికి ముందు తనను కాల్చాలని ఆవేదనను వెలిబుచ్చారన్నారు. దళితులపై దాడులకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఐక్య కార్యాచరణను చేపట్టనున్నట్లు తెలిపారు. అధిక ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 17న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు.
మంగళవారం మఖ్దూం భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ నయీం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నయీం ద్వారా అధికారులు, ఇతరులు ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరికి ఎంత డబ్బు అందింది, తదితర వివరాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వమే పెంచి పోషించిన వ్యక్తి నయీం అని వ్యాఖ్యానించారు.