
'కన్హయ్య యుద్ధం చేయడానికి రాలేదు'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ యుద్ధం చేయడానికి రాలేదని, రోహిత్ వేముల తల్లిని పరామర్శించడానికి వచ్చారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ అన్నారు. కన్హయ్యను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని నారాయణ విమర్శించారు.
హెచ్సీయూలోకి వెళ్లకుండా కన్హయ్యను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. కన్హయ్యను అడ్డుకునేందుకే హెచ్సీయూ వీసీ అప్పారావును మళ్లీ వెనక్కి రప్పించారని ఆరోపించారు. కేంద్రానికి, సంఘ్ శక్తులకు బుద్ధి చెబుతామని నారాయణ హెచ్చరించారు. యూనివర్సిటీలను పోలీసు క్యాంపులుగా మార్చారని విమర్శించారు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రోహిత్ తల్లి రాధికతో కలసి హెచ్సీయూకు వచ్చిన కన్హయ్యను పోలీసులు అడ్డుకున్నారు. హెచ్సీయూలోకి వెళ్లకుండా గేటు బయటే కన్హయ్య వాహనాన్ని ఆపివేశారు. క్యాంపస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.