సీఎం వ్యాఖ్యలపై తమ్మినేని ఫైర్
Published Thu, Dec 29 2016 3:09 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
మల్యాల: గుండుసూదులు గుచ్చే పార్టీ అంటూ సీపీఎంను సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న తమవి దిక్కుమాలిన ఉద్యమాలు అని వ్యాఖ్యానించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ హుంకరింపులకు బెదిరేది లేదని, న్యాయం జరిగే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ భూసేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందినట్లు ప్రకటించుకోవటం రైతులకు, పేదలకు అన్యాయం చేయటమేనని తెలిపారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా 29న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు ఇతర నిరసన కార్యక్రమాలను చేపట్టాలని తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement