సాక్షి, హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభల చివరిరోజున భాగ్యనగరం ఎరుపెక్కింది. ప్రధాన కూడళ్లు, డివైడర్లన్నీ ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలతో అరుణ వర్ణాన్ని సంతరించుకున్నా యి. ఐదురోజులపాటు జరిగిన మహాసభలు ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభతో ముగిశాయి.
ఈ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతోపాటు త్రిపుర, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. సభా ప్రాంగణం ఉదయం నుంచే జనంతో పోటెత్తింది. పెద్దసంఖ్యలో కార్యకర్తలు రోడ్డుపైనే నిలబడ్డారు. విజయవాడకు వెళ్లే రహదారి అంతా జనసంద్రమైంది.
5 వేల మందితో కవాతు
కామ్రేడ్లు భారీ ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఎర్రరంగు టీషర్టులు ధరించిన దాదాపు 5 వేల మంది కార్యకర్తలు మలక్‌పేట్ టీవీ టవర్ నుంచి కవాతు చేపట్టారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఈ కవాతును జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ్నుంచి ర్యాలీ సభాప్రాంగణానికి చేరుకుంది. ఈ క్రమంలో విజయవాడ రహదారి ట్రాఫిక్‌తో స్తంభించింది. గంటన్నర పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ సభ నేపథ్యంలో పోలీసు యంత్రాం గం పక్కాగా ఏర్పాట్లు చేసింది.
విప్లవ గేయాలకు అనూహ్య స్పందన
బహిరంగ సభ ప్రాంగణం వద్ద కళాకారులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కళాకారుల ప్రదర్శనలు సాగాయి. విప్లవ గేయాలు ఆలపిస్తున్న సమయంలో సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment