
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ప్రతిపక్షపార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడం సబబు కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి మంగళవారం మాట్లాడారు.
అభిశంసన తీర్మానంపై చర్చ జరిగితే అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయని, నోటీసును ఏకపక్షంగా తిరస్కరించడం ద్వారా చర్చకు అవకాశం లేకుండా చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ విధానం, పార్టీ నిర్మాణం, నాయకత్వ ఎన్నికపై మహాసభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసమే పోరాడతామని తమ్మినేని అన్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.