- ట్యాంకర్ల విషయంలోనూ అదే తీరు
- వాణిజ్య, గృహావసరాల నీటి ట్యాంకర్లు 551
- నిరుపేదల బస్తీలకు నీరందించే ట్యాంకర్లు 127
- సంపన్న ప్రాంతాల్లో నీరందించే కమర్షియల్ ట్యాంకర్లు 150
- నారాయణగూడ డివిజన్‌లో ఉచిత నీటి సరఫరా ట్యాంకర్లు 2
- మారేడ్‌పల్లి, సరూర్‌నగర్ ప్రాంతాల్లో... 1
సాక్షి, సిటీబ్యూరో: పేదలకు ఉచితంగా నీళ్లిచ్చే విషయంలో చేతులెత్తేసిన జలమండలి.. కనీసం అందుబాటులో ఉన్న నీటిని సైతం సమానంగా పంపిణీ చేసే విషయంలోనూ చతికిలపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత మంచినీరు సరఫరా చేస్తూ అక్కడి జలబోర్డు ప్రజల మన్ననలు పొందుతుండగా.. నగరంలో నీటి సరఫరా విషయంలో పెద్దలపై ప్రేమ.. పేదలపై వివక్ష చూపుతూ జలమండలి విమర్శల పాలవుతోంది.
అందరి నుంచీ ఒకేవిధంగా నీటిచార్జీలు వసూలు చేస్తున్నా... అల్పాదాయ, మధ్యాదాయ, పేద వర్గాలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు అరకొరగా మంచినీటిని సరఫరా చేస్తూ.. సంపన్నులు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు అత్యధికంగా నీటిని సరఫరా చేస్తోంది. ఉదాహరణకు సంపన్నులు నివాసముండే గచ్చిబౌలి ప్రాంతంలో ప్రతి కుళాయికి నెలకు సగటున 71 కిలోలీటర్ల (71 వేల లీటర్లు) నీటిని సరఫరా చేస్తుండగా.. అదే అల్పాదాయ వర్గాలు అత్యధికంగా ఉండే సైదాబాద్ ప్రాంతంలో ప్రతి కుళాయికి కేవలం 13 కిలోలీటర్లు (13 వేల లీటర్లు) మాత్రమే సరఫరా చేస్తుంది. దీనిని బట్టి జలమండలి వివక్ష ఏ మేరకు ఉందో సుస్పష్టమౌతోంది.
సంపన్నులపైనే ప్రేమ
జలమండలి వివక్షాపూరిత విధానానికి ఎన్నో రుజువులున్నాయి.
సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఎస్.ఆర్.నగర్ (డివిజన్-6) పరిధిలో 77,202 కుళాయిలున్నాయి.
వీటికి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది.
అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు నివసించే గోషామహల్, మంగల్‌హాట్, జియాగూడ, ఆళ్లబండ, గౌలిగూడ, రెడ్‌హిల్స్, కార్వాన్, హుమాయూన్‌నగర్, షేక్‌పేట్, గోల్కొండ ప్రాంతాల్లో సుమారు లక్ష కుళాయిలున్నాయి.
వీటికి రోజువారీ సరఫరా 30 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు.
77 వేల పైచిలుకు కుళాయిలకు 40 మిలియన్ గ్యాలన్ల నీటిని నిత్యం సరఫరా చేస్తున్న జలమండలి.. లక్ష కుళాయిలకు 30 మిలియన గ్యాలన్లే సరఫరా చేస్తుంది.