మరింత పెరిగిన ‘నోటు’ కష్టాలు
- రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భారీ క్యూలు
- ఖాతాదారులకే సేవలందిస్తున్న బ్యాంకులు.. కోలుకోని వ్యాపారాలు
- క్యూలలో నిలబడిన వారికి మంచి నీటి ప్యాకెట్లను సరఫరా చేస్తున్న పలు స్వచ్చంద సంస్థలు
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారంతో జనం కష్టాలు రోజు రోజుకూ మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద క్యూలైన్లు మరింత భారీగా తయారయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7 వేల ఏటీఎంలు ఉండగా నగదు పెట్టిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. బ్యాంకుల్లోనూ కేవలం రూ.2,000 నోట్లను మాత్రమే ఇస్తున్నారు. మార్కెట్లో వాటికి చిల్లర లభించడం లేదు. దీంతో వ్యాపారాలన్నీ చితికిపోతున్నాయి. పాలు, పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల వ్యాపారులు ఓ వైపు చిల్లర లేక.. మరోవైపు గిరాకీలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆటోవాలాలు సైతం చిల్లర సమస్యతో సతమతమయ్యారు. ఉద్యోగులు, కూలీలు బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చుని విలువైన పనిగంటలు కోల్పోతున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లలో నిల్చున్న వినియోగదారులకు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయడం కనిపించింది.
పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాం కులు తమ ఖాతాదారులకు సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో నగదు మార్పిడి కోసం వచ్చినవారు గంటల తరబడి క్యూలలో నిల్చోవాల్సి వచ్చింది. అరుుతే ఆస్పత్రులు, పెట్రోలు బంకులు, బస్సు, రైలు టికెట్ల కొనుగోలుకు ఈనెల 24 వరకు అనుమతించడం కాస్త ఊరటనిచ్చింది. చాలా పెట్రోలు బంకుల్లో రూ.500 పాత నోటుతో వెళితే చిల్లర లేదని.. పూర్తి మొత్తానికి పెట్రోల్/డీజిల్ పోసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.