
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. భారీగా మంటలు ఎగిసిపడ్డ సంఘటన బుధవారం సాయంత్రం నగరంలోని అత్తాపూర్‌లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ సమీపంలోని ఇందిరాగాంధీ బొమ్మ పక్కన టీ దుకాణంలో సిలిండర్ ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలింది.
దీంతో ఆ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.