సానియాను అప్పగించండి
సింథియా బంధువుల ఆందోళన
శంషాబాద్ : భర్త చేతిలో హత్యకు గురైన ఆఫ్రికాలోని కాంగోవాసి సింథియా కూతురు సానియాను తమకప్పగించాలని ఆమె బంధువులు, స్నేహితులు రెండోరోజూ ఆందోళనకు దిగారు. గురువారం శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సింథి యాను హత్య చేసిన రూపేష్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసి న వ్యక్తులను హతమార్చడమే కఠిన శిక్షంటూ నినాదాలు చేశారు. హంతకుడికి ముసుగు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటని, అతడిని ముసుగు లేకుండా చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంపై తమకు అపారమైన గౌరవముందని, తమకు న్యాయం చేయాలని నినదించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలతోపాటు పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై వారు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వారికి నచ్చచెబుతుండగా వారితో కూడా వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో పోలీసులతో చర్చించేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా ఎంబసీ అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయిం చారు. సానియాను తమకే అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు పలుమార్లు సముదాయించడంతో వారు అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లిపోయారు.