బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ | d.k aruna fires on her brother and cm kcr | Sakshi
Sakshi News home page

బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ

Published Fri, Apr 15 2016 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ

బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్ఎస్ లో చేరను: డీకే అరుణ

మా తమ్ముడు నాన్నకు, నాకు మచ్చ తెచ్చాడు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొట్టిన చెంపదెబ్బ గుర్తు లేదా?
చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై అరుణ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: కష్టాలు వస్తే బిచ్చమైనా ఎత్తుకుంటా గానీ టీఆర్‌ఎస్‌లో చేరేది లేదని మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తమ్ముడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం దారుణమన్నారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి, బీమా ప్రా జెక్టు కోసమే పార్టీ మారుతున్నాననడం సిగ్గుచేటన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలోనే బీమా 90 శాతం పూర్తయింది.ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్ చేసేదేమిటి? నా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ప్రతిష్టకు, నా ప్రతిష్టకు రామ్మోహన్ మచ్చ తెచ్చాడు. కుటుంబ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాలను వమ్ము చేస్తూ పార్టీ మారడం సరైంది కాదు. 1996లో నేను టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేశాను. అప్పుడు మక్తల్ ఎమ్మెల్యేగా మా తండ్రి నర్సిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పని చేశారు. సొంత కూతురు ఓడిపోతుందని తెలిసినా పార్టీకే కట్టుబడ్డారు. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి తన అంకితభావాన్ని నిరూపించుకున్నారు’’ అని డీకే గుర్తుచేశారు. 2004లో తన తండ్రిని, మరో సోదరుడిని నక్సల్స్ కాల్చి చంపితే, వారి వారసత్వంతో అనివార్యంగా రామ్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎవరి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎవరి ప్రతిష్టకు మచ్చ తెచ్చారో, ఎవరి ఆశయాలకు తూట్లు పొడిచారో ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మొన్నటికి మొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేతిలోనే రామ్మోహన్‌రెడ్డి చెంపదెబ్బ తిన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చెంప దెబ్బ కొట్టినా ఎలా వెళ్లాడో, కొట్టిన వ్యక్తి తాలూకు పార్టీలో ఎలా చేరారో అర్థం కావడం లేదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేయాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్ నుంచి మళ్లీ గెలవాలని తమ్మునికి అరుణ సవాలు విసిరారు. పార్టీ మారుతున్నట్టుగా తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరుణ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ‘‘నన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోంది. అయినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేది లేదు’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement