
అడ్డంకి అయితే తప్పుకుంటా
సీఎంకు డి.కె.అరుణ రాజీనామా లేఖ
సాక్షి, హైదరాబాద్: గద్వాలను జిల్లా చేయడానికి తాను ఎమ్మెల్యేగా ఉండటమే అడ్డం కి అయితే తన రాజీనామాను స్పీకరుకు పంపాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ లేఖ రాశారు. ఈ మేరకు శనివారం ఆమె గాంధీభవన్‌లో తన రాజీనామా లేఖను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యం, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, సాగునీరు, తాగునీరు, రైల్వే సౌకర్యం, రోడ్లు, రవాణా సౌకర్యాలు, భూమి విస్తీర్ణం, జనాభా, రాబడి, భౌగోళిక పరిస్థితి వంటి అంశాల ప్రకారం జిల్లాలు చేస్తారని ఆశించినట్టు చెప్పారు.
అయితే అన్ని విధాలా అనుకూలతలున్న గద్వాలను జిల్లా కేంద్రంగా చేయకుండా వనపర్తి జిల్లాలో నడిగడ్డ(గద్వాల, ఆలంపూర్)ను కలుపుతున్నట్టుగా ప్రభుత్వం ముసాయిదా వెలువరించిందన్నారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలన్నారు. గద్వాలను వనపర్తి జిల్లాలో కలపొద్దని ప్రజలు, ప్రజా ప్రతినిధులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. అయితే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. అరుణ ఎమ్మెల్యేగా ఉండటం వల్లనే జిల్లా కావడం లేదని, తాను రాజీనామా చేస్తే జిల్లా వస్తుం దని టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారన్నా రు. రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోందన్నారు. తాను ఎమ్మెల్యే పదవిలో ఉంటూ గద్వాల జిల్లాకు అడ్డంకిగా కాబోనని, జిల్లాకోసం పదవి వదులుకుంటానన్నారు.