డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం క్యూ...
కలెక్టరేట్‌కు తరలివస్తున బస్తీవాసులు
మహిళలతో కిటకిలాడుతున్న ‘మీ కోసం’
సర్దిచెప్పలేక అధికారుల తంటాలు
సిటీబ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తులతో వచ్చిన మహిళలతో హైదరాబాద్ కలెక్టరేట్ కోలాహలంగా మారింది. త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హామీలు కురుపిస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ ఆసరా లేని నిరుపేద ప్రజలు ఇళ్ల దరఖాస్తులతో కలెక్టరేట్‌కు తరలి వస్తున్నారు. దీంతో మీ కోసం కార్యక్రమం వచ్చిందంటే చాలు అధికారులు భయపడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న మహిళలు ఇళ్ల కోసం ఎక్కడ గందరగోళం సృష్టిస్తారోనన్న అందోళన వారిని వెంటాడుతున్నది. గతంలో అలాంటి పరిస్థితులు తలెత్తటమే ఇందుకు కారణం. దీనికి తగ్గట్టుగానే నగరంలో ఇటీవల నలుగురు రాష్ట్ర మంత్రులు వివిధ బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయటం వంటి కార్యక్రమాలు...అనూహ్యంగానే మహిళలను కలెక్టరేట్‌కు రప్పిస్తున్నాయి. సోమవారం ఇళ్ల దరఖాస్తులు సమర్పించుకోవటానికి వచ్చి మహిళలతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది.
వందలాదిగా మహిళ లు తమ ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని తరలివచ్చారు. దీంతో ఏమి చేయా లో తోచని అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కొంత మేరకు ఇళ్ల దరఖాస్తులను స్వీకరించారు. మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య పెరుగటంతో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తిచెప్పారు. కలెక్టరేట్ నుంచి వారిని సాగనంపారు. ఫలితంగా మహిళలు ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా జేసీ భారతి హోళికేరి మాట్లాడుతూ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేశామని, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే అందజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా పదే పదే వస్తున్నారని, ఇది సరికాదన్నారు. అర్హత, సీనియారిటీని బట్టి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.