
అప్రజాస్వామికంగా భూసేకరణ: దామోదర
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఓ విద్యుత్ కేంద్రం కోసం భూసేకరణ విషయంలో చట్టాన్ని గౌరవించకుండా, హైకోర్టు స్టే పట్టించుకోకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరి స్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గొలివాడ గ్రామానికి చెందిన రైతులతో కలసి గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అక్కడ భూములు కోల్పోతున్న నిర్వాసితులు 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారని దామోదర చెప్పారు. భూనిర్వాసితుల మొరను ఆలకించిన హైకోర్టు 240 ఎకరాల పట్టా భూముల్లో ఎలాంటి చర్యలను తీసుకోవద్దని, పరిహారంపై స్పష్టత వచ్చేదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిందన్నారు.
కానీ, అంతర్గాం మండల రెవెన్యూ అధికారి రెండ్రోజుల క్రితం ఇళ్లకు నోటీసులను అంటించారన్నారు. ఆ వెంటనే 300 మంది పోలీసులతో ఓ కాంట్రాక్టు సంస్థవారు పట్టా భూముల్లోనే పనులను ప్రారంభించారన్నారు. ఇది ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమా, లేక ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్రభుత్వమా అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలతో కలసి ఉద్యమిస్తామని దామోదర హెచ్చరించారు.