
ఇప్పటికైనా పోరాడవా... చంద్రబాబూ!
* అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదు
* వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో కనీసం ప్రస్తావనైనా లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయరా? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్ని పుష్కలంగా కేటాయిస్తామని జైట్లీ చెప్పారే గానీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదన్నారు.
చంద్రబాబును ప్రజలు గెలిపించింది వారి తరఫున పోరాడ్డానికే గాని, ఆయన స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాదని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా ఉంటూ తెగించి పోరాటం చేయకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ నెల 10నవైఎస్సార్‌సీపీ చేబట్టబోయే ధర్నాల్లో చంద్రబాబు వైఫల్యాన్ని ఎండగడతామని ధర్మానహెచ్చరించారు. సీఎం చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ధర్మాన మండిపడ్డారు. ఉత్తరాంధ్రనువెనుకబడిన ప్రాంతంగా కేంద్రం గుర్తించి ఇచ్చిన నిధులను ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు.